పుట:2015.373190.Athma-Charitramu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 138

చేయఁదలంచితిమి. భావోద్రేకమున నా కారాత్రి మంచి నిద్దుక పట్టలేదు.

ఒకటి రెండు రోజులు జరిగినపిమ్మట, మే మిద్దఱము మరలఁ గలిసికొని పత్రికాస్థాపనమును గుఱించి సంభాషించితిమి. ఆఱునెలలవఱకును తాను దానిని బోషింతునని నామిత్రుఁడు చెప్పినప్పుడు, అటులైన పత్రిక తప్పక వెలయఁగల దని నే ననుకొంటిని. మఱునాఁటిసాయంకాలము మే మిరువురము వీరేశలింగముగారి యింటికిఁ బోయి, నూతనపత్రికను గుఱించి వారితో మాటాడితిమి. దీని కాయన మిగుల సంతోషించి, మావలెనే యౌవనమున దాను "వివేక వర్ధనీ" పత్రికను బ్రకటించినసందర్భము జ్ఞప్తికిఁ దెచ్చుకొని, ఆపత్రిక వెనుకటిప్రతులలోనివ్రాఁతలు కొన్ని మాకుఁ జదివి వినిపించెను. పత్రిక నెలకొల్పుటకుఁ జేయవలసిన కార్యక్రమము మాకుఁ దెలియఁబఱచెను. వలసినచో నేను పత్రికాధిపతిగ నుండెద నంటిని.

ఆమఱునాఁటి యుదయమునుండియె నూతనపత్రికాస్థాపన విషయమై నేను దలపోయసాగితిని. వివేక వర్థినిని బ్రారంభించుటకు వీరేశలింగముగారికిఁ గల యాశయములె మా దృష్టిపథమునను వెలసి యుండుటచేత, పేరున నించుక మార్పు చేసి, నూతనపత్రికకు "సత్య సంవర్థిని" యని నామకరణము చేసితిని. క్రొత్తపత్రిక కంతట "విజ్ఞాపనము" వ్రాసి 6 వ తేదీని నే నది పంతులుగారికిఁ జూపించితిని. అది బాగుగ నుండె ననియు, కొంచెము తగ్గించినయెడల, అదియే పత్రికలో ప్రథమవ్యాసముగ ముద్రింపవచ్చు ననియుఁ బంతులుగారు చెప్పఁగా, నే నెంతో సంతోషపడితిని. అప్పటినుండియు నేను "సత్య సంవర్థనీ" పత్రికకు వ్యాసములు వ్రాయుటతోఁ గాలము గడిపితిని. "అను