పుట:2015.373190.Athma-Charitramu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 136

బండి'కిరాయి' తగ్గుటచేత, స్వల్పలాభము స్వల్పనష్టముక్రింద దిగెను. ఇదే బండ్లమ్మివేయుట కద నని నేను మాతండ్రిని హెచ్చరించితిని. ఒక బండి యమ్మివేయుట కాయన యొడఁబడుటచే, కొంచెమునష్టమునకు దానిని, దానియెద్దులను అమ్మివేసితిమి. కష్టనష్టములు పెరుఁగుచుండుటచేత, రెండవబండిని ఎద్దులనుగూడ పోకడపెట్టితిమి. మా మామగారి సంగతి కూడ నిట్లే జరిగెను. ఉభయకుటుంబములును, ఈ బండ్లవ్యాపారమున మూటగట్టుకొనినది, శ్రమయు ఋణమును మాత్రమే! ఈయప్పు భావికాలమందలి కుటుంబఋణమునకు ప్రాతిపదికము కూడ నయ్యెను !

31. రచనావ్యాసంగము

చెన్నపురినుండి వచ్చిన మఱుసటిదినముననే నా పుస్తకములు సరదుకొని, చెలికాండ్రను జూచివచ్చి మద్రాసులో నారంభించిన వ్రాతపని సాగింపఁబూనితిని. నా గురువర్యులగు వెంకటరత్నముగారిని చూచినపుడు, తెలుఁగులోనికి తర్జుమా చేయు మని యాయన నా కొక యింగ్లీషుపుస్తక మిచ్చెను. అది నేను ముందు వేసికొని, యింటఁ గూర్చుంటిని. తెలుఁగున గద్యపద్యరచనము చేయ నే నుద్యమించి, పోపు విరచిత మగు "సార్వజనికప్రార్థన"ను, 'గ్రే' వ్రాసిన "పెంపుడుపిల్లి" యను గీతమును, పద్యరూపమున ననువదించితిని. చేంబర్సు "నీతిపాఠక పుస్తక" మందలి పాఠములు కొన్ని చదివి తెలుఁగు చేసితిని. వీనిలోఁ గొన్ని కరపత్రములుగఁ బ్రచురించి ప్రార్థనసమాజ పక్షమున జనుల కుచితముగఁ బంచిపెట్టుట మంచి దని తలంచితిని. వీరేశలింగముగారు తెప్పించుకొనుచుండు "ఇండియన్ మెసెంజర్" అను బ్రాహ్మసమాజ వారపత్రికను జదువుటకు వారమువారమును వారిం