పుట:2015.373190.Athma-Charitramu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. చెన్నపురి ప్రయాణము 129

ఇదివఱకు నే నెన్నఁడును సముద్రదర్శనము చేసియుండలేదు. నాకన్నుల కిపుడు లోక మంతయు వింతవన్నెలు దాల్చినటు లుండెను ! బిడియముచేత పొగయోడలో వీరేశలింగముపంతులు మున్నగు పరిచితు లుండుచోటఁగాక వేఱొకచోటఁ గూర్చుంటిని. ఓడ మఱునాఁటియుదయమునకు బందరురేవు చేరి, సామా నెక్కించు కొనుచు నచటనే సాయంకాలమువఱకును నిలిచియుండెను. ఒక్కొకసారి పెద్దయలలు చెలరేగుటవలన బందరురేవు కల్లోలముగ నుండును. నాఁ డంతయు పొగయోడ పెద్దకెరటములతాఁకున కుయ్యల వలె నూఁగుటచేత, పైత్యప్రకోపమున నాకు వాంతులయ్యెను. సాయంకాలము పొగయోడ కదలిపోయినపుడు శమనము గలిగి, కొంచెము ఫలాహారము చేసితిని. మఱునాఁటి యుదయమునకు చెన్నపురి సమీపించితిమి. అనతిదూరమున నగరము సముద్రముమీఁద మిగుల రమణీయముగఁ గానవచ్చెను. అపుడు వీరేశలింగము బుచ్చయ్యపంతులు గార్లు కనఁబడి, కుశలప్రశ్న చేసి, పట్టణమందలి తమబసకు నన్నాహ్వానించిరి. క్రొత్తప్రదేశము చూచి బెదరిననాకు, చేరఁబిలిచిన యీ ప్రాఁతపరిచితులు ప్రాణరక్షకులవలెఁ గానఁబడిరి ! వారితో నే నంత పరశువాక మేగితిని. అచ్చట బుచ్చయ్యపంతులుగారి కొక లోగిలి గలదు. ఆసాయంకాలమే వీరేశలింగముగారితో నేను గుజిలీబజారు మున్నగు పురభాగములు సందర్శింప వెడలితిని.

నేను చెన్నపురిలో బుచ్చయ్యపంతులుగారియింటనే విడిసి వీరేశలింగముగారియతిథిగ నుంటిని. ఒకొక్కప్పుడు బుచ్చయ్యపంతులుగారితోఁగూడ భోజనము చేయుచుందును. నేత్రవైద్యాలయమునకుఁ బోవునపుడు తప్ప, తక్కినకాలమందు నే నింటనో బయటనో వీరేశలింగముగారితోనే యుండుచువచ్చితిని. రాజమంద్రియందు నాకుఁ