పుట:2015.373190.Athma-Charitramu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 128

మత సంఘ సంస్కరణవిషయముల ప్రసంగప్రణాళిక యంతయు నింతటినుండి జరిగెను.

ఇవి ప్రార్థనసమాజ వార్షికోత్సవదినములు. మద్రాసునివాసులు, సంఘసంస్కారులు నగు మన్నవ బుచ్చయ్యపంతులుగా రిపుడు కొన్ని దినములనుండి రాజమంద్రిలో వీరేశలింగముగారియింట బసచేసి యుండిరి. ఏప్రిల్ 9 వ తేదీని బుచ్చయ్యపంతులుగారు "ఈశ్వరసేవ"ను గుఱించి ప్రసంగించిరి. వయస్సు తీఱిన యనుభవశాలి యగు పంతుల వాక్కులను యువకులము మేము సగౌరవముగ నాకర్ణించితిమి. ఆ మఱుసటిదినము సారంగధరపర్వతమున భగవన్నామసంకీర్తనముచేసి, గీతములు పాడుచు, పురప్రవేశము చేసితిమి. నా కన్నుల కాసమయమున నాచార్యపదవి నధిష్ఠించిన యిద్దఱుపంతుళ్లును ఋషిసత్తముల వలెఁ గానవచ్చిరి. కొన్నిదినములక్రిందటనే కళాశాల వేసవికి మూయఁబడెను. 11 వ తేదీని నేను వీరేశలింగముగారియొద్దకుఁ బోయి, నేత్ర వైద్యమునకై చెన్నపురి కేగవలెనని చెప్పితిని. ఆయనయు, బుచ్చయ్య పంతులును సకుటుంబముగ మఱునాఁడే చెన్నపురిప్రయాణము పెట్టుకొనియుండుటచేత, నన్ను దమతోఁ దీసికొనిపోయెద మనిరి.

కొంతకష్టముమీఁద నా చెన్నపురిపయనమునకు మా తలిదండ్రులు సమ్మతించిరి. వీరిని, తమ్ములను చెల్లెండ్రను నేను విడిచిపోవునపుడు, అందఱమును కంట నీరు పెట్టుకొంటిమి. కొందఱు స్నేహితులతో పడవప్రయాణముచేసి, 13 వ తేదీని కాకినాడ చేరితిని. మఱునాఁడు ప్రొద్దుననే సహచరుఁడగు మద్దిరాల రామారావుగారియింట భోజనము చేసి, ఒకడబ్బాతో మంచినీరు, ఇంకొకదానితో పెరుగును కొంత మిఠాయియు వెంటఁదీసికొని, నేను చిన్న పడవమీఁదఁ బోయి, సాయంకాలమున పొగయోడ నెక్కితిని.