పుట:2015.373190.Athma-Charitramu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. చెన్నపురి ప్రయాణము 127

మృత్యుగర్భము సొచ్చెను ! ఆ బాల్యస్నేహితుని యకాలమరణము నాహృదయనౌకను దు:ఖజలధిని ముంచివైచెను. ఓ మరణదేవతా ! నీచేష్టల నిరోధించు సాధనకలాప మీభూలోకమున నెచటను లేనేలేదా ?

29. చెన్నపురిప్రయాణము

రాజమంద్రికళాశాలలో పట్టపరీక్షతరగతిలో నేనును, ప్రథమశాస్త్రపరీక్షతరగతిలో మాతమ్ముఁడును జేరి చదువుచుంటిమి. మా స్నేహితులు కనకరాజు గంగరాజులు తిరిగి రాజమంద్రి వచ్చి ప్రథమ శాస్త్రపరీక్షకును, కొండయ్యశాస్త్రి ప్రవేశపరీక్షకును మరలఁ జదువుచుండిరి. అంతకంతకు సంఘసంస్కారప్రియుల సావాసము మరిగి. శాస్త్రి మున్నగు పూర్వాచారపరులతోడి సంసర్గము నేను విరమించు కొంటిని.

సంఘసంస్కరణసమాజము వెనుకటివలెనే పనిచేయుచున్నను, క్రమక్రమముగ దానిప్రాశస్త్య మణఁగిపోయి, ప్రార్థనసమాజప్రాముఖ్యము హెచ్చెను. నిజమునకు రెండుసమాజముల సభ్యులు నొకకూటము వారే. చర్చనీయాంశముల విషయనవీనత నానాటికి వన్నెవాసి, చేయుపని యంతగఁ జేతులకు లేకపోవుటచే, సంస్కరణసమాజ వ్యాపనము ప్రార్థనసమాజకార్యక్రమమున నంతర్లీనమై, కాలక్రమమున నేతత్సమాజము ప్రత్యేకవ్యక్తిత్వమును గోలుపోయెను ! ఇట్లనుటవలన, సంస్కరణాభిమానము సభ్యుల మనస్సీమనుండి వీసమంతయుఁ దొలఁగె నని తలంపఁగూడదు. ప్రార్థనసమాజసభ్యత్వము సంస్కరణాభిమానమునకుఁ బర్యాయపద మగుటచేత, ఏకోద్దేశమున రెండుసభలు జరుపుట యనగత్యమై, ప్రార్థనసమాజము పేరిటనే