పుట:2015.373190.Athma-Charitramu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 126

చుకొనుటకును, నే నంతట నిశ్చయించుకొంటిని. పరీక్షలో తిరిగి యపజయమందిన మిత్రులగు కనకరాజును గంగరాజును పరామర్శ చేయుటకు నేను నర్సాపురము పోయి వచ్చితిని. మార్గమధ్యమున వేలివెన్నులో నే నొకదినము నిలిచియుండఁగా, అచటి బంధువులు నా పరీక్షావిజయవార్త తెలిసి యానందమందిరి. నే నిఁక జదువు చాలించి యుద్యోగము చేతు నని కొందఱును, న్యాయవాది నయ్యెద నని కొందఱును, అచటఁ జెప్పుకొనిరి. వారికి నాయూహలతోను, ఆశయములతోను బ్రసక్తియె లేదు !

కొలఁది రోజులలో ప్రవేశపరీక్షా ఫలితములును దెలిసినవి. తమ్ముఁడు వెంకటరామయ్య జయమందెను. కొండయ్యశాస్త్రి మరల తప్పెను. సోదరుల మిరువురము పరీక్షల నిచ్చి, కళాశాలలో నున్నతవిద్య నభ్యసింప నున్నందుకు నే నానందనిమగ్నుఁడ నైతిని. మా విద్యాపరిపోషణము చేయవలసిన జననీజనకుల బాధ్యతాభారము మాత్ర మతిశయించుచుండెను !

నేను వెంకటరావును జూచుటకు 13 వ తేదీని పోయినప్పుడు, పాపము, అతఁ డవసానదశయం దుండెను ! అపుడును న న్నాతఁ డానవాలు పట్టెను. వెంటనే వైద్యుని బిలువు మనియు, తనదేహమున నిముసనిముసమును ఉబుకుచుండెడి నీటియూటను దోడివేయించి తన జీవములను గావు మనియును, రోగి యాత్రమున నన్ను వేఁడుకొనెను ! నే నచట నిలువలేక పోయితిని. వైద్యుఁడు శక్తివంచనలేక పని చేయుచుండినను, నీటిపొంగు సరికట్టుట దుస్సాద్య మని యచట నుండువారు నాకుఁ జెప్పి వేసిరి ! దైన్యమున నే నింటికి వెడలి పోయితిని. మఱునాఁడు నాతఁ డట్లె యుండెను. అంతకంతకు రోగికి దాహ మతిశయించెను. ఆ మఱుసటి దినమున వెంకటరావు