పుట:2015.373190.Athma-Charitramu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. పరీక్షలు 119

కాండ్రు కానఁబడినందున, షికారు మాని సంభాషణమునఁ బాల్గొంటిని.

రాత్రి, సంభాషణసందర్భమున కొండయ్యశాస్త్రి, వీరేశలింగముగారి పాండిత్యప్రకర్షమును నిరసించెను. ఓపికతో నే నూఁకొట్టుచుంటిని. అంతకంత కాతనిప్రల్లదము పెచ్చు పెరిఁగి, "ఇతనికంటె దుర్నీతిపరు లెవరు?" అని శాస్త్రి వదరెను ! నే నిఁక పట్టలేక, "ఈ మహాసంస్కర్తను గూర్చి నీ విట్లు కాఱులు ప్రేలి, నీ యవివేకము నవినీతియు వెల్లడించుకొనుచున్నావు ! నోటికిఁ గొంత బుద్ధి చెప్పుము !" అని వానిని వారించితిని. అంత శాస్త్రి, "వీరేశలింగము చేసిన భ్రష్టులేకఁదా యీ విద్యార్థిలోకము ! ఎంతమందిబాలు రీతిని యుసురు పోసికొని యధమగతిపా లైరి ! ఇం తేల ? సంస్కరణములను పేరుతో నీవు నమ్మెడి వంకరటింకర సూత్రములకు ఈదుష్టగ్రహమే కారకుఁడుగదా !" అని రోషావేశమునఁ బలికి, యీసంస్కర్తప్రహసనాదులందు తమ ప్రవర్తనమును వెల్లడించి వెక్కిరించుటచేత జీవితములను గోలుపోయిన కొందఱు సజ్జనులను గుఱించి శాస్త్రి పెద్ద సోదె చెప్పుకొనివచ్చెను !

నాకు తీవ్రమైన యాగ్రహము జనించినను, శాంతించి, నే నిట్లు తలపోసితిని : - "దైవమా ! పంతులవంటి గొప్పవారిని పామరజనులే కాక, శాస్త్రివంటి విద్యాధికులుగూడ నెట్లు దురభిప్రాయులై దూషించుచున్నారు ! ఇంక వారి కేది శరణ్యము !"

శాస్త్రితలంపులు వికృతములు విపరీతములును ! అంతరంగ మెంత కలుషిత మైనను, మందహాససుందరవదనమున భాసిల్లి,