పుట:2015.373190.Athma-Charitramu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20. జననీజనకులతోడి సంఘర్షణము 81

గొమ్మ. మొన్నటి ఫలాహారములకై ప్రార్థనసామాజికులకు సంఘబహిష్కార మగు నని యాయన కొందఱితో ననెను. ఇది తెలిసి మా తలిదండ్రు లలజడి నొందిరి. ఆనెల 27 వ తేదీని ప్రొద్దున నేను భోజనము చేయుచుండఁగా, మాతల్లి నాతో, "నాయనా ! మనది పెద్దకుటుంబము. పిల్లల కందరికీ పెండ్లిండ్లు పేరంటములు కావలసియున్నవి. మ మ్మందరినీ చిక్కులపాలు చేయదలచుకొన్నావా యేమి?" అనినపుడు, "ఏమి టిది? నే నేమిచేసినానో చెప్పితే సమాధానము చెప్పుతాను !" అని పైకి గంభీరముగఁ బలికితినే గాని, మాతమ్మునికి వెంకటరత్నమునకును వివాహ మాడవల దని నే జేసిన రహస్యబోధన వారిచెవులఁ బడినదా యని లోన నేను భీతిల్లితిని ! మాతల్లి సూచించినసంగతి యిది గాక, మొన్న సారంగధరుని మెట్టమీఁది ఫలాహారముల యాందోళన మని తెలిసి, తల తడివి చూచుకొని, "దాని కేమిలే! కిట్టనివాళ్లు పరిపరివిధముల చెప్పుకుంటారు - వీరేశలింగముగారి యింట తయారైన ఫలాహారములు పుచ్చుకొనేవెఱ్ఱివారము కాములే ! మాతోపాటు కచేరీగుమస్తా లనేకులు ఫలాహారములు చేసినారులే !" అని నేను సమాధానము చెప్పితిని.

ఉదంతము లింత సులభముగా నంతమొందినవి గావు. కొన్ని దినములపిమ్మట, రాత్రి భోజనసమయమున, మాతండ్రి నాతో మతమునుగుఱించి సంభాషించుచు, :భగవంతుడు హృదయాలయమందే దర్శింపఁదగినవాఁ డనుట వాస్తవమే. కాని మనము జనాభిప్రాయమునకు వెరవక తప్పదు జాతిమతభ్రష్టు లై పోయిన క్రైస్తవులపాట్లు దేవునికి తెలుసును" అని పలికెను. నేనుమాత్ర మిది యొప్పుకొనక, సత్య మని నమ్మినచొప్పున నడుచుకొనెడివారిని దురదృష్టవంతు లన వీలు లే దనియు, బుద్ధిపూర్వకముగ స్వీకరించిన మార్గమునఁ గలిగిన