పుట:2015.373190.Athma-Charitramu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 82

కష్టసుఖములను సమత్వమున వా రనుభవించుట న్యాయ మనియును నేను జెప్పివేసితిని.

మా దీర్ఘ సంభాషణ ఫలితముగఁ దేలినసంగతులు నేను దినచర్య పుస్తకమున నిట్లు విమర్శించితిని : - "మా జనకుఁడు జనాభిప్రాయమును శిరసావహించెడిభీరుఁడు; నే నన్ననో, స్వబుద్ధి సూచించిన సత్యపథమునఁ బోయెడిధీరుఁడను. ఆయన, పామరజనాచారములను గౌరవించి యనుసరించువాఁడు; నేను, వానిని నిరసించి నిగ్రహహించెడి వాఁడను. వే యేల, మా నాయన పూర్వాచారపరాయణుఁడు; నేను నవనవోన్మేషదీధితుల నొప్పెడి సంస్కారప్రియుఁడను !" పాఠకులు నా యౌవనమునాఁటి యహంభావమునకు వెఱ గంద కుందురు గాక !

21. ముత్తుస్వామిశాస్త్రి విపరీతవిధానము

ముత్తుస్వామిశాస్త్రి నాసహవాసు లందఱిలోను విద్యాధికుఁడును, మేధాశక్తిసంపన్నుఁడును. ఒక్కొకసరి యాతఁడు సంఘ సంస్కారవిషయములందు చోద్యములగు సూత్రములు సిద్ధపఱచు చుండువాఁడు. ఆయేప్రిలు 10 వ తేదీని నేను మృత్యుంజయరావుతోఁ గలసి, శాస్త్రిదర్శనమున కార్యాపుర మేగితిని. మే మనేకసంగతులను గుఱించి మాటాడుకొంటిమి. అంత మాసంభాషణము సంస్కరణములదెసకు మరలెను. "ఏటి కెదు రీదినంతమాత్రమున మనము సంస్కారులము కాఁజాలము. పూర్వాచారపరాయణులవలెనే మనమును కర్మ కలాపమును విసర్జింపక, నిరర్థక మని నమ్మినయాచారకాండ ననుష్ఠానమునకుఁ దెచ్చి, సంఘమును మెల్ల మెల్లగ మనవైపునకుఁ ద్రిప్పుకొనవలెను." అనునాతనిమాటలు మాకు హాస్యాస్పదములుగఁ దోఁచెను.