పుట:2015.373190.Athma-Charitramu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 80

పరిశోధనము గావించుకొని, నాసంస్కారాభిమానమే దీనికిఁ గారణమని స్పష్టపఱుచుకొంటిని ! నే నింతటితో నూరకుండక, వధువు సోదరుఁడును, కళాశాలాసహవాసుఁడును నగు వెంకటరత్నముతో నీ సంగతిని గూర్చి మాటాడి, యీబాల్యవివాహమున కడ్డపడు మని వానికిని బోధించితిని. అతఁడు సమ్మతించినను, తనకుఁగూడ వివాహము చేయఁ బూనిన తండ్రి, తనమాటలు వినకుండు నేమో యని భీతిల్లెను.

అంతటఁ గొన్నిదినములకు నరసయ్యగారు మాయింటికి వచ్చి, మాజనకుఁడు గ్రామాంతరమున నుండుటచేత, తాను సంకల్పించుకొనిన యీవివాహమును గుఱించి నా యభిప్రాయ మడిగిరి. ఆయనతో ధారాళముగ మాటాడ నొల్లక, నాబోటిపసివారు అభిప్రాయ మీయఁ దగ రని చెప్పివేసియూరకుంటిని ! నాయసమ్మతిని మితభాషిత్వమున మాటుపఱిచి, గర్వమునఁ గులుకుచుంటి నని నన్నాతఁ డెత్తిపొడువఁగా, వివాహమును గుఱించి వరుఁడె పలుకవలయును గాని, యితరుల యూహ లేమిప్రయోజన మని యంటిని. అంత టాయన, "వరుఁడు బాలుఁడు కావున, నతనిసమ్మతితో మనకు ప్రసక్తి లేదు. నాకుమారునిసంగతి చూడు ! ఈసమయమందే వానివివాహమును గదా. పెండ్లిని గుఱించి ప్రస్తావము వచ్చినపు డెల్ల, వాఁడు తల వాల్చియుండును. కాఁబట్టి యిట్టిబాలురవిషయములో పెద్దవాళ్లె యోచింపవలెను " అని పలుకఁగా, నేను, "కావుననే పిల్లలమగు మ మ్మాలోచన లడుగక, పెద్దలగు మీరును, మాతండ్రియును మీచిత్తము వచ్చినట్టె చేయరాదా ?" అని రోషముతోఁ బ్రత్యుత్తర మిచ్చితిని.

రెండవసంగతి, యిటీవల జరిగిన ప్రార్థనసమాజ వార్షికోత్సవ సందర్భమునఁ గలిగిన యాందోళనము. కళాశాలలో పండితులగు కస్తూరి శివశంకరశాస్త్రిగారు పూర్వాచారపరాయణత్వమునకుఁ బట్టు