పుట:2015.373190.Athma-Charitramu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 78

మున జరిగిన యొక యుదంతమునుగూర్చి చెప్పవలెను. ఆదినములలోనే ప్రార్థనసమాజవార్షికోత్సవము జరిగెను. ఉత్సవఁపుఁ గడపటినాఁడు, సభికులు పట్టణమున కనతి దూరమందలి సారంగధరపర్వతమునకుఁ బోయి, ఆ నిశ్శబ్దస్థలమున, ప్రార్థనానంతరమున, తమసమాజ సౌభ్రాతృత్వమునకు సూచకముగఁ గలసి ఫలాహారములు చేయుట యాచారమయ్యెను. ఇది గర్హ్యమని హిందూసంఘమువా రెంచి, యిట్టి సంఘసభ్యులను బహిష్కృతులను గావించుటకు గుసగుసలు సలుపుచువచ్చిరి. ఆనెల 22 వ తేదీని ప్రార్థనసామాజికులము సారంగధరుని మెట్టకుఁ బోయితిమి. ఫలాహారము చేసినవారికి సంఘబహిష్కార మగు నని మాకుఁ దెలిసెను. ఇట్టిబెదరింపులకు భయపడవల దనియును, కష్టనష్టము లాపాదించినచో సహనబుద్ధితో మెలంగుట సంస్కరణ పరాయణులకర్తవ్య మనియును నేను జెప్పితిని. కనకరాజున కీ మాటలు కోపము కలింగించెను. తనపొడ కిట్టనిచో, మాకు ప్రతిబంధకము గాక, తాను వెడలిపోయెద నని యాతఁడు చెప్పివేసెను ! ఎట్ట కేల కాతనిని శాంతింపఁజేసి కొండమీఁదికిఁ గొనిపోయితిమి. ప్రార్థన ఫలాహారము లైనపిమ్మట, పర్వతము దిగి, ముత్తుస్వామి శాస్త్రి బ్యాండుస్వరము పాడుచుండఁగ, మే మందఱము, సైనికనికాయము వలె పదతాడనము చేసి నడుచుచు, బాలికాపాఠశాలయొద్ద విడిపోయి, యెవరియిండ్లకు వారు వెడలిపోయితిమి.

20. జననీజనకులతోడి సంఘర్షణము

నేను సంఘసంస్కరణమును గుఱించి తీవ్రాభిప్రాయములు గలిగి, నిర్భయముగ వానిని వెల్లడి చేయుచుండుటచేత, నా కెల్లెడలను విరోధు లేర్పడిరి. ఇంటను, బయటను సంస్కరణమును గుఱించి నిరతము ప్రసంగించుటయె నా కపుడు ముక్తిమోక్షము లయ్యెను !