పుట:2015.372412.Taataa-Charitramu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జంషెడ్జితాతాయు కొందరు వాటాదార్ల గూర్చుకొని, 1869 లో చౌకగ అమ్ముచున్న యొకతైలయంత్రమును కొని, దానికి కండెలను మగ్గములను చేర్చి, బట్టలమిల్లుగా జేసి, 'అలెగ్జాండ్రామిల్లు' అనుపేర, దానిని నడపెను కాని ఈమిల్లును ముదుకునూలునే చేయును. అంతకన్న సన్ననినూలుబట్టల జేయు మిల్లును తాతా స్థాపింపదలచెను; అవకాశము దొరకగనే 1873 లో అలెగ్జాండ్రామిల్లు ఒక శ్రీమంతున కమ్మి వేయబడెను; అందుచే తాతాకు కొంతలాభము కలిగెను.

లోగడ దూదియెగుమతి వ్యాపారముకై యింగ్లండులో నుండినప్పుడు జంషెడ్జి అచటిమిల్లుల కార్యమును గమనించెను. అంతట మన దేశమందు తాను మిల్లుపరిశ్రమ సాగింపవలెనని తాతా కుత్సాహము కలిగెను. కాని యీలోగా ఇంగ్లీషుమిల్లులందు సన్ననూలుకై యంత్రములను పద్ధతులను బాగుచేసి క్రమముగ కొత్తరకముల బెట్టుచుండిరి; ఆపరిశ్రమ రహస్యములను నవీనపద్ధతులను బూర్తిగ తెలుసుకొనుటకు మరల నిగ్లండు జని, జంషెడ్జి అచటి లంకషైరులో కొత్తయంత్రముల స్వయముగ బరీక్షించి, సన్ననూలు తయారుచేయు పద్ధతులను వ్యాపారమర్మములను గ్రంహించి, తన కవసరమగు ప్రశస్త యంత్రముల నెన్నుకొని, తిరిగివచ్చెను. అప్పుడే యీజిప్టుప్రక్కను సూయెజుకాలువ త్రవ్వబడి, మధ్యధరాసముద్రముద్వారా, మనకు యూరపుతో దగ్గరదారి యేర్పడెను; ఇట్లు రాకపోకల సౌకర్యము హెచ్చెను.