పుట:2015.372412.Taataa-Charitramu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. తాతా బాల్యదశ.

పార్సీల ప్రాచీనగ్రామము లన్నిటిలో ముఖ్యమైనది 'నవసారి' ఇదిబరోడారాజ్యమున 'తపతీ' తీరమందు (సూరతుకు 18 మైళ్ళదూరమున) ఉన్నది. అందలి పార్సీ గురువులగు 'దస్తుర్లు' 19 వ శతాబ్దాంతమువరకు మన స్వాములవర్లవలె పూర్వాచారపరులై, సంస్కరణముల ప్రతిఘటించుచుండిరి. కాని 'కూపకూర్మ' తత్వము పార్సీయులకు రుచింపలేదు. వారు బాల్యమున దస్తుర్లయొద్ద మతవిద్యబడసి, సూరతు, బొంబాయి, అహమ్మదాబాదు పురములజేరి, అందు వ్యాపారముజేసి ధనికులై, ఉదారభావముతో దాన మొనర్చుచుండిరి.

నవసారియే తాతావంశీయులకును స్వగ్రామము, జంషెడ్జి పూర్వీకుడగు 'బెహరము' ను 'దస్తురే' ; అతడు ధీమంతుడయ్యు, కొంత శీఘ్రకోపి, అందుచే, తరుచు, ఇతరులపై చీకాకు పడుచుండెను. ఆయన దారిని బోవునపుడు కొంద రల్లరిపిల్ల లాయన తీవ్ర స్వభావు డని సూచించుటకు 'తాతా' అనుచుండిరి.†[1] ఈ 'తాతా' అను మాట తన చెవినిబడగ నే బెహరం మరింత కోపించుచుండెనట. ఆయన యుడికినకొలదిని బాలు రాపేరునే మరింత వాడజొచ్చిరి. ఇట్లాయనకు కొంతకాలముకు 'తాతా'యే వాడుకపేరై, తుదకా వంశ మంతకు నది వంశనామము లేక 'ఇంటిపేరు' అయిపోయెను.

  1. † సంస్కృతమున 'తప్త' అనగా 'వేడియైన, తీవ్రమైన, తపించిన' అని అర్ధము. ప్రాకృతమున 'తప్త'యే 'తాతా' అయినది. ప్రాకృతపు ఘూర్జర శాఖనుండి వచ్చిన గుజరాతిలోను నిదేరూపము.