పుట:2015.372412.Taataa-Charitramu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యి, సోమరితనము వృద్ధియగును; ఇంక ఆసోమరులస్థితి బాగుండుటజూచి, ఇతరులును యాచకులే అగుదురు; ఇట్లు యాచకత్వమును ప్రోత్సహించుటచే, మనదేశముకు చాల హానికల్గుచున్నదని ఆయన యభిప్రాయము. మరియు ఇట్టి అనవసర దానముకు సొమ్ము ఖర్చుచేయుటవలన, జనుల కుపయుక్తమగు సంస్థలకు సహాయము లేకుండుటయు సంభవించును. ఎన్నియో ప్రజాక్షేమకరమగు సంస్థలు తగు ద్రవ్యసహాయము లేక, దీనస్థితిలో బడి క్షీణించుచున్నవి. అందుచే దేశాభివృద్ధికై పనిచేయునని తనకు తృప్తియగుసంస్థలకు, తమశక్తిని సద్వినియోగము చేయదలచు వ్యక్తులకును మాత్రమే, జంషెడ్జి ద్రవ్యసహాయము చేయుచుండెను.

ఇట్లే స్వశక్తివిషయమునను ఆయన ఉచితవ్యయసూత్రమునే గమనించెను. అనేకరంగములందొక్కరు పనిచేయదలచిన, అట్టివాని శ్రమయంతయు వ్యర్ధమై, తగినంతఫలము లేకుండబోవును. సాధారణముగా మనశక్తులను మనతత్వము కనుకూలమగు కొన్నివిషయములందు మాత్రము కేంద్రీకరించుట యవసరమగుచుండును. మతవేదాంతాది విషయములందు రాజకీయములందుగూడ వాగ్వ్యయమొనర్చుట ఆయనప్రకృతికి ప్రతికూలము. మరియు అట్టిపనులచేయువారు మనదేశీయులలో నిప్పటికే చాలమంది గలరు. ఆర్థికపారిశ్రామిక విషయములందు కార్యరూపమున కృషిచేయువారు మనలో చాలతక్కువ. ఆకృషి యత్యవసరము. తనశక్తి నందుకే జంషెడ్జి వినియోగించెను.