పుట:2015.372412.Taataa-Charitramu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈపరిశ్రమవలన బొంబాయిప్రాంతపు వ్యవసాయాదులకును చాలనుపయోగము కల్గినది. పూర్వము సముద్రములోనికి పోవుచుండిన నీరు విద్యుచ్ఛక్తి పుట్టించుటకై కొండలనుండి మరల్పబడి, గొట్టములద్వారా యంత్రచక్రములపైబడి, క్రింద నేలపై పెద్దకాలువలుగ నిరంతరము పారును. అది స్వచ్ఛమగు వర్షోదకము; ఆచుట్టుపట్ల భూములను తోటలుగ జేసి, అందా సమృద్దజలముతో కూరగాయలను, పూవులను, మంచిపండ్లను, విశేషముగ పండించి, బొంబాయికి పూనాకు సప్లై చేయుచున్నారు. ఇందుకు ప్రత్యేకసంఘము లేర్పడినవి. ఈనీరు జనులు త్రాగుటకును ప్రశస్తమైనది. అందువలన కొంత నీరు పానీయముగను ఉపయోగపడును.†[1]

  1. † తాతా జలవిద్యుచ్ఛక్తిసంఘము చాల లాభకరముగ పనిచేయు చుండుటవలన, ఆరీతిని తమప్రాంతమున మద్రాసుప్రభుత్వమువారు సుమా రైదేండ్లక్రిందట 'పైఖారాస్కీమ్‌' అనబడు ఉద్యమమును స్థాపించిరి. సహ్యాద్రి దక్షిణాగ్రమున (నీలగిరికొండల సమీపమున) 'పైఖారా' అను చిన్న నది యొకటికలదు; దానినీరు కొండలోయలో పెద్ద యడ్డుగట్లు మూలమున నిలవజేయబడి, పెద్ద జలపాతమును, అందుండి విద్యుచ్ఛక్తియు, కలిగింపబడుచున్నవి. ఒక సం. నుండి ఇందువిద్యుచ్ఛక్తి తయారగుచున్నది. ఈవిద్యుచ్ఛక్తిని నిలవజేసి, తీగలపైన నీలగిరి, కోయంబత్తూరు, సేలం, తిరుచునాపల్లి, మధుర మున్నగు తమిళ జిల్లాలలోని పురములకును, గ్రామములకును గూడ, ప్రభుత్వమువా రందజేయుచున్నారు. ఇందువలన వేలకొలది బీదలకు వృత్తులును, ఆజిల్లాల జనులకు చాల సదుపాయములును, ఏర్పడినవి. ఈపైఖారా విద్యుచ్ఛక్తి, తాతాకంపెనీ వారమ్మునంత చవుక గాకున్నను, ఆవిరియింజనుద్వారా మన మునిసిపాలిటీలలో జనింపజేయు విద్యుచ్ఛక్తికన్న చవుకగనే యున్నది.