పుట:2015.372412.Taataa-Charitramu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలన యాంత్రికపరిశ్రమల స్థాపించిన తాతాగారి చరిత్రమును గ్రంథరూపమున మరల ఆంధ్రపాఠకులయెదుట నుంచుట ఉపయోగకరమా యని సందేహము కల్గుట సహజము. కాని యీవిషయమున కొన్ని సదర్భముల మరువరాదు. మిల్లులు మున్నగు మహాయంత్రములందు బహులోత్పత్తినొంది మనదేశముకు దిగుమతియగు వస్తువులతో, పూర్వపుపనిముట్లతో చేతితో తయారగువస్తువులు సాధారణముగ పోటీచేయలేవని మనకు ప్రత్యక్షముగ కనబడుచున్నది.

మనప్రస్తుతపు ఆర్ధికదుర్దశనుబట్టియు, రుచిభేదముచే సహజప్రవృత్తిని బట్టియు, చాలమందిజనులు చౌకయగుయాంత్రిక వస్తువులనే కోరుచున్నారు. ఈవస్తువులకే, (మన్నిక పనితనముగల చేతివస్తువులకన్న,) చలామణి చాలహెచ్చుగ నున్నది. ఈస్థితి విచారకరమైనను యధార్ధమని గమనింపక తప్పదు. చేతిపనులకు మనమెట్టి ప్రోత్సాహమిచ్చినను, అవి గ్రామజనులకు సహాయకములైనను, ఇప్పటి నాగరికతను బట్టి దేశీయావసరము లన్నిటిని తీర్ప లేవు. ఈయాంత్రిక నాగరికత దుర్ని వారముగా వేగముతో వృద్ధియగును, సర్వత్ర వ్యాపించుచున్నది. చేతితో తయారగు వస్తువులనే అభిమానించు వారుగూడ నిత్యమును వ్రాతకోతలకు, రాకపోకలకు, చాలపనిముట్లకు, నిత్యావసరములగు చాలకార్యములకు యాంత్రికవస్తువులనే వాడుచుండుట ఎంతమాత్రమును తప్పుట లేదు. వానివాడుక క్రమముగా హెచ్చుచున్నది