పుట:2015.372412.Taataa-Charitramu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాతాకంపెనీవారిప్రజ్ఞ, కార్యశూరత్వము, దేశీయులకు విదితమై, తాతావారిప్రతిష్ఠ హెచ్చెను. 'స్వదేశీ' వలన బొంబాయి మిల్లుదార్లకు చాల లాభించెను. బొంబాయిలోని కోటీశ్వరులగు కొందరు తమమిల్లులకు విద్యుచ్ఛక్తి నీకంపెనీనుండి తీసుకొనుటకు ఖరారునిచ్చిరి; వా రీకంపెనీలో చాలవాటాలను గూడ తీసికొని, కొంత ద్రవ్యమిచ్చిరి. తుదకు, 1910 నవంబరులో, ఈ సంఘము 'తాతాహైడ్రో-ఎలెక్ట్రిక్ సప్లైకంపెనీ' అను పేర రిజిస్టరు చేయబడెను.

మొదట నిర్ణయించిన మూలధనము రెండుకోట్ల రూపాయలు. తాతాకంపెనీవారే యాసంఘము నడుపుట కేజెంట్లుగా నేర్పడిరి. కొన్నివాటాలను తాతాకంపెనీవారే తీసికొనిరి; కొన్నిటిని బరోడా గయక్వారు మొదలగు స్వదేశీయ రాజులు, మరికొన్నింటిని కొందరు మిల్లుయజమానులు మున్నగు వ్యాపారస్తులును, తీసికొనిరి. ఇట్లు మూలధనమంతయు చేకూరెను. అంతట ద్రవ్యబాధ వదలి, దొరాబ్జితాతా తదేకదీక్షతో కృషిచేసెను. సస్సూన్‌డేవిడు, ఆర్. డి. తాతా, రత్నతాతా, బ్రోచా మున్నగు భారతీయులే చాలవర కిందు డైరక్టరులు; సర్ దొరాబ్జితాతా ఈబోర్డు కధ్యక్షుడయ్యెను. 1911 ఫిబ్రవరిలో, బొంబాయిగవర్నరగు సిడెన్హాం ప్రభువుచే దీని కట్టడములకు పునాది వేయబడెను. 700 మంది కూలీలతో ఇంజనీర్లు వేర్వేరుకట్టడముల నిర్మాణకార్య మారంభించిరి.