పుట:2015.372412.Taataa-Charitramu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదివరలో ప్రపంచమందున్న విద్యుచ్ఛక్తి కుపయోగించు జలపాతములన్నియు సహజమగు జీవనదులవి; ఆజలపాతములకు నీరు నిలవచేయనక్కరలేదు; అందు పెద్దరాతికట్టడము లక్కర లేదు. సహ్యాద్రియం దట్లుకాదు; ఇచట హిందూమహాసముద్రమునుండి వచ్చు నైఋతిమేఘములు కొండలదాకుడువలన విపరీతమగు వర్షోదక మాకొండలందు బడును. కొండలందు మూడునెలలలో బడుదానినంతను అరికట్టి, సాలుకంతకును నిలవయుంచుటకు, చలనము లేని ఆనకట్టలబోలు బ్రహ్మాండమగు రాతిగోడల గట్టవలసివచ్చెను. ఉత్తరమందున్న 5 మైళ్ళ విశాలమగు 'షిరాటా' సరస్సుకు 31 గజములయెత్తును మైలున్నరపొడుగునుగల గోడనుకట్టి, అందు 720 కోట్ల ఘనపదములనీటికై కొండలలోనుండి సుమారు మైలుపొడుగు సొరంగముత్రవ్వి, 'వల్వాన్‌' సరస్సుకు దారిజేసిరి. ఈ 'వల్వాను'ను నిట్లే దీర్ఘమగు పెద్దరాతిగోడలతో బిగించి, 1500 ఎకరముల మహాసరస్సుగ జేసిరి. ఇందుండి కొండలలోనే మూడుమైళ్ళ దూరమందలి 'లోనవ్లా'కు దారిచేయబడినది. 'లోనవ్లా'కు నిట్లే యింకొక బలీయమగు రాతిగోడ నిర్మింపబడినది. ఇందలి నిలవనీరు చాలనప్పుడు, ఇట్లు పై రెండుసరస్సులనుండియు దీనికి నీరువచ్చును.

కొండలమధ్యనున్న యీ 'లోనవ్లా'సరస్సులోని యుదకము కృతకనదీప్రవాహముగ, ఆకొండపీఠభూమియంచుకు