పుట:2015.372412.Taataa-Charitramu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సున్నపురాళ్ళనుమాత్రము బర్మానుండి తేవలెనని, అందు వ్రాయబడెను. ఈరిపోర్టును వెంటనేచదివి, జంషెడ్జి మరలతీవ్రకృషి నారంభించెను. గనులకు ప్రభుత్వమువారిచ్చు కవుళ్ళ విషయమై యప్పటికమలులోనుండిన నియమము లతికఠినములై యుండెను. 1899 లో, అందుప్రతిబంధకమైన షరతులు తగ్గింపబడినవి. అంతట గనులపని కొంతసుకరమయ్యెను. జంషెడ్జి 1900 సం. లో నింగ్లండుకువెళ్ళి, అచట భారతమంత్రియగు హమిల్టను ప్రభువుతో లోహపరిశ్రమ స్థాపించుటకై తానుచేయు యత్నములగూర్చి చెప్పి, ఆయనసానుభూతిని సంపాదించెను. 1882 లో వలెగాక, ఈసారిప్రభుత్వమువారతనికి సాయముచేయగలరని, హమిల్టనుగారు వాగ్దానముచేసిరి.

అంతట స్వదేశముకు తిరిగివచ్చి, జంషెడ్జి చందాజిల్లాలోని 'లోహర' గనుల కవులకై మరల దరఖాస్తుపంపెను. ప్రభుత్వమువారీసారి యనుకూలభావము దెల్పిరి. కాని చాలవివరములగూర్చి దీర్ఘ విచారణ, ముందుగా పరిశోధన, కావలెనని తేల్చిరి. 1902 వేసవిని తాతా మరల బ్రిటనుకుచని, ఆలస్యము లేకుండ జేయుమని భారతమంత్రితో ప్రశంసింపదలచెను. అప్పుడు విక్టోరియా మరణానంతరము, 7 వ ఎడ్వర్డురాజుగారి పట్టాభిషేకోత్సవపు ప్రయత్నములు జరుగుచుండెను. ఆతొందరవలన భారతమంత్రికి తీరిక లేకుండెను. అంతట నింగ్లండు జర్మనీల బొగ్గుగనులను, అచటి యుక్కుయంత్రశాలలను బరీక్షించి, తాతా యమెరికాకు చనెను.