పుట:2015.372412.Taataa-Charitramu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందు సంయుక్త రాజ్యమున లోహపరిశ్రమ చాలవృద్ధిలో నున్నది. అచటి నిపుణులతో మాట్లాడి, ఆయన వారిపరిశ్రమపద్ధతుల గమనించెను. అటనుండి తనకుమారునికి వ్రాసి, మనదేశమున గనులపరీక్షను జరిగించుచునే ఉండెను. లోహఖనిజముల గూర్చియే గాక, అమెరికనుల బట్టలమిల్లుల గూర్చియు, విద్యుచ్ఛక్తి శాలలగూర్చియు, ఆయాత్రలో తాతా చాల సంగతుల గ్రహించెను. అమెరికాలో నయాగరా జలపాతమునుండి విద్యుచ్ఛక్తిని పుట్టించుపద్ధతుల జూచెను. పిట్సుబర్గు పురమున ప్రపంచమంతటికి పెద్దవగు లోహయంత్రములుగలవు. ఆపరిశ్రమకు నాయకుడగు 'కన్నడి' తో కొన్ని సమస్యల జర్చించెను. ఆయన మంచిసలహాలనిచ్చెను. ఆయన సలహాపైన 'పెరిను' అను మహనీయుడగు విజ్ఞుని న్యూయార్కు నగరమున కలుసుకొని, ఆయనను చాలహెచ్చుజీతముపైన తనలోహపరిశ్రమ పరీక్షకు ముఖ్యోద్యోగిగ జేసెను. పెరినుగారు మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనబడు లోహవాస్తుశాస్త్రమున నిధి. ఆయనసహచరుడగు 'వెల్డు'గారు వెంటనే ముందుగా మనదేశమువచ్చి, ఆయాస్థలముల భూతత్వము బరీక్షింపసాగెను.

ఈలోగా అమెరికాలో పనియై నంతట, తాతా లండనుకువచ్చి, భారతమంత్రితో మాట్లాడి, అటనుండి జర్మనీవచ్చి, బొంబాయిలో తానుకట్టిన 'తాజ్ మహల్ హోటలు' కవసరమగు ఎలెక్ట్రికువస్తువు లన్నిటిని జర్మనుశాలలందు వెదకి కొని, 1902 డిసెంబరులో మరల స్వదేశము చేరెను.