పుట:2015.372412.Taataa-Charitramu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. లోహయంత్రశాల.

జంషెడ్జి తాతా తన అంత్యకాలముకు ముందు మరి రెండు పెద్దపరిశ్రమలగూడ స్థాపింపయత్నించెను. అందొకటి మంచియినుమును, ఇనుపవస్తువులను జేయుట; రెండవది జలపాతమూలమున విద్యుచ్ఛక్తిని తయారుచేసి, దానిని చోదక శక్తిగను, దీపాదులకును, వినియోగించుట. బొంబాయిలోని మిల్లు పరిశ్రమ పరాధీనత లేకుండ, వీలైనంతవరకు నిరాఘాటముగ సాగవలెనని, ఆయనగాఢముగ కోరెను. మిల్లులను ఇతర పరిశ్రమలను స్థాపించుటకు వలయు యంత్రములన్నిటిని, చాల వ్యయప్రయాసలకులోనై, మనమితరదేశముల నుండియే తెప్పించుకొనవలసి వచ్చుచున్నది. సూది, గుండుసూది, మంచిచాకులు, మేకులు, ఉక్కు తీగలు మున్నగు నిత్యావసరమగు చిన్నపనిముట్లుగూడ తరుచు విదేశములనుండియే తెచ్చుకొనుచుంటిమి. ఇవి మనదేశమందే తయారు కావలెనన్నచో, మంచియినుము, ఉక్కు సమృద్ధిగ తయారుచేయవలెను. మరియు బొంబాయిలో మిల్లులు మున్నగు యంత్రములకు చోదకశక్తినిచ్చు నేలబొగ్గు చాలదూరమునుండి రావలెను. అది సమృద్ధిగ సకాలముకు దొరుకకను, రాణిగంజి ప్రాంతమునుండి రైలుపై దెచ్చుటకు వ్యయప్రయాసలు హెచ్చుట వల్లను, బొంబాయి పరిశ్రమలకు చిక్కు గల్గుచుండెను. అందువలన తాతా బొంబాయికి సమీపమగు