పుట:2015.372412.Taataa-Charitramu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పటికి సుమారు డెబ్బదిమందివరకు భారతీయు లీఫండు సహాయమున విజ్ఞానవంతులై గొప్ప వైద్యులో, ఇంజనీర్లో, కలెక్టరులో అయిరి. *[1]

యంత్రనిర్మాణము, గనులపని, బైసికిళ్ళు, మోటారు, అద్దములు, రసాయనవస్తువులు మున్నగు ఆధునిక పరిశ్రమలన్నిటి యభివృద్ధికి, శిల్పాదులకు గూడ, విజ్ఞానార్జన మత్యవసరము. అందుకై ప్రతిసాలున చాలమంది విదేశముల కేగుచో, వారికి విదేశములందు చాల వ్యయప్రయాసములు, అనారోగ్యాదులచే బాధలును, కలుగును. అంతమంది కచటతగు ప్రవేశము దొరకుటయు కష్టము. మరియు చాలకాలమట్లు విజ్ఞానముకై కేవల మితరదేశములపై నాధారపడుట భావ్యముకాదు. కనుక మనవిశ్వవిద్యాలయములం దంతవరకు లభింపని యున్నత విజ్ఞానమును యువకులు మనదేశమందే నేర్చుకొనుటకును, నూతన పరిశోధనల జేయగల్గుటకును, మనదేశమందే గొప్ప విజ్ఞానాలయమును స్థాపింపవలెనని జంషెడ్జి నిశ్చయించెను.

  1. * యూరపియనే కలెక్టరు అగుటవలన, అతనికివచ్చు జీతము పెన్షను వగైరాలు దాదాపు అంతయు విదేశములకే పోవును. ఆయుద్యోగము భారతీయునికి వచ్చిన, అతనికి రాజ్యాంగానుభవము మున్నగు లాభములు గల్గుటే గాక, అతనికి వచ్చు జీతమువగైరా లీదేశమందే నిల్చియుండును. మొత్తము మీద లెక్కజూచినచో, యూరపియను స్థానమున భారతీయుడే ఐ. సి. ఎస్. అయి ఉద్యోగి అగుటవలన, సగటున రెండేసిలక్షల రూపాయలు మనదేశముకు లాభమని తాతా గుణించి నిర్ణయించెను.