పుట:2015.372412.Taataa-Charitramu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముచేయబడును. *[1] ఆసొమ్ము సాయమున విదేశములం దున్నత విద్యనభ్యసించి పరీక్షలో కృతార్ధులైనవారు మరల స్వదేశముకు వచ్చి తరువాత పెద్దఉద్యోగులో డాక్టరులో వ్యాపారులో అయి, చాల సొమ్ము సంపాదింపవచ్చును. అట్లు సంపాదనలో నున్న యెడల, తరువాత వారు (తమ సంపాదనచేగల్గు ఆదాయమునుండి) తా మిదివరలో తీసికొన్న సొమ్మును కొంతకొంతగా వసూ లిచ్చుచు, తాతా ఫండు వారిసొమ్మును యధాశక్తిగ తీర్చివేయవలెను.

ఆపద్ధతివలన నాయువకు లితరుల ద్రవ్యమును భిక్షగ దీసికొంటిమను నైచ్యములేకుండ, స్వయం సహాయముననే వృద్ధికి వచ్చిన ట్లాత్మగౌరవము కల్గియుందురు; మరియు నాపద్ధతివలన తాతా యేర్పర్చిన యాఫండు నశింపులేక, ఎప్పటికప్పుడు భర్తీ యగుచు తరతరములుగ నట్లేనిల్చి, ముందుతరముల యువకుల కెల్ల కాలము నుపయోగించును. అప్పటినుండి నేటివరకు చాలమంది మనయువకు లీఫండుసహాయమున, ఇంగ్లండు, జర్మనీ, అమెరికా మున్నగుదేశములం దనేకవిజ్ఞానవిద్యల నభ్యసించి, స్వదేశమున కనేకవిధముల నుపకరించియున్నారు.

  1. * ఆయువకు లిద్దరిలో నొకడు పార్సీగ నుండవలెనని మొదట ఒక షరతుండెను; కాని ఉదారుడగు తాతా కొలదియేండ్లకే ఆషరతు తొలగించి, ఆయువకు లందరును భారతీయు లెవరైననుసరే, బీదలు అర్హులు నయిన చాలునని నిర్ణయించెను.