పుట:2015.372412.Taataa-Charitramu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, ఆధునికములగు ఉన్నతవిజ్ఞాన పరిశోధనాలయముల స్థాపనకు చాల ద్రవ్యము కావలెను. యూరపు అమెరికా లందు గొప్ప కుబేరులు విజ్ఞానాభివృద్ధి యావశ్యకతను గమనించి, తమదేశముల పురోభివృద్ధికి గొప్ప విరాళములనిచ్చి, అనేక విజ్ఞానపరిశోధనశాలల స్థాపించి, జరుపుచున్నారు. అచ్చటి విశ్వవిద్యాలయములకును చాల ద్రవ్యనిధి యుండుటచే, అందును పరిశోధనలకు మంచి యవకాశములు గలవు. మన దేశముననున్న శ్రీమంతుల కట్టి యభినివేశము లేదు. అప్పటికి విజ్ఞానాలయ స్థాపనకు యత్న మేమియు కలుగ లేదు. అందుచే, తాతాయే మార్గదర్శకుడై, మంచి విజ్ఞానాలయముకై అధమము 30 లక్షల రూపాయలు కిమ్మతుచేయు స్థిరవసతి నిచ్చుటకు నిశ్చయించి, 1898 లో ఆసంగతిని ప్రకటించెను.

అట్టి విజ్ఞానాలయము జయప్రదమగుటకు ప్రభుత్వపు ఆదరప్రోత్సాహము లవసరములు. అది స్థిరముగ జరుగుటకు ప్రభుత్వము నిబంధన చేయవలెను; అందు చదివి కృతార్ధులైన యువకుల పట్టముల గుర్తించి, వారి కున్నతోద్యోగములను పరిశ్రమలం దుచితస్థానమును, ప్రభుత్వ మీయవలెను. ఆ విజ్ఞానాలయము బాగుగ వృద్ధిజెందుట కింకను ద్రవ్యసహాయ మవసరము. అందుచే దానికి తనపేరు పెట్టకూడదని తాతా