Jump to content

పుట:2015.329863.Vallabaipatel.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

వల్లభాయిపటేల్

భాయిలో లేదు. ఆయన గంభీర శాస్త్రజ్ఞానము శూన్యము; లోకమాన్యుని రాజనీతికౌశలము లేదు. కాని యాయనలోని యత్యధికపరిశ్రమ, పట్టుదల, వల్లభాయిలోఁ గలవు. లోకమాన్యునివలె వల్లభాయికూడఁ బ్రజాసేవలో నాత్మవిస్మృతితోఁ గృషిచేయును. లోకమాన్యునివలె నాయనకూడఁ దన్నుగుఱించి యేమియు వ్రాయఁడు. చెప్పఁడు. ఇంతేగాదు, లోకమాన్యునివలెఁ బైకిఁ గఠినుఁడుగా, నిష్ఠురుఁడుగా, నభిమానిగాఁ గన్పించునుగాని, సహజముగా, సరళుఁడు, కోమలుఁడు. స్వాతిశయము లేనివాఁడు.

రాజకీయవేత్తగాదు - యోధుఁడు.

ఇన్ని సమానగుణము లున్నప్పటికిని వీరిలో విభేదమేమి? అసలు వల్లభాయి లోకమాన్యునితో సరిసమానుఁడుకాదు. వా రుభయులలో జన్మతః విశేషవ్యత్యాసము కలదు. లోకమాన్యుఁడు రాజకీయ వేత్త. వల్లభాయి రాజకీయవేత్త కాదు. యోధుఁడు; సైనికుఁడు. సేనాధిపతి, రాజకీయవేత్తలోను యోధునిలోను, దత్త్వతః యధికాంతరము కలదు. రాజకీయవేత్త జిహ్వ చాల యదుపాజ్ఞలలో నుండును. అతని శబ్దములు మృదువై, సహజముగా రెండర్థములు కలిగియుండును. సహజముగా నతడు మనోగతాభిప్రాయమును మాటల ద్వారా వెల్లడించఁడు. అత డవసరము నుపయోగించుకొనును. యోధుఁ డట్లుగాక తద్భిన్నముగా సంచరించును. ఆతడు భావనను దత్త్వమును గ్రహించి సంచరించును. నైతిక విజయము లక్ష్యమైనను భౌతికావకాశములు తీసికొనుట యతని కంత