Jump to content

పుట:2015.329863.Vallabaipatel.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

వల్లభాయిపటేల్

లకుఁగూడ నిదే యొఱవడి; ఇదే సంస్థానములకుఁ బరీక్ష. పెక్కుసంస్థానములు మున్నీ పరీక్షలో నెగ్గలేదు. నిరంకుశముగాఁ బ్రవర్తించెడివి; ప్రజల యోగ క్షేమములయెడ శ్రద్ధవహించెడివికావు. మధ్యయుగముల జమీందారీహయాము నడిపినవి. పలు సంస్థానములలోఁ బ్రధానప్రభుత్వ కార్యాలయముకాని, స్వతంత్రన్యాయస్థానముకాని, ముఖ్యములైన యితరకార్యాలయములుకాని లేవు. ప్రజల యోగక్షేమములకు సరియగు ప్రణాళికలే లేవు. ఈ లోపముల సవరించి నూతనపరిపాలనము నేర్పాటు చేయవలెను. నిరంకుశాధికారము రూపుమాసి బాధ్యాతాయుతప్రభుత్వము నెలకొనినప్పుడే పరిపాలనమున నూతనత్వము విలసిల్లును."

పటే లెన్నడో యీ సంస్థానములను నాశనము చేయుదునని శపథము చేసెను. ఆయన పలికిన పలుకు తప్పక నెఱవేర్చుకోగలిగినాఁడు.

బార్డోలీ సత్యాగ్రహోద్యమమును నడుపుచు పటేల్‌జీ యొకయుత్తరములో "బ్రిటీషు సామ్రాజ్యాంతమునేగాదు, స్వేదేశసంస్థాన రాజరికములనుగూడ నీ దేశమున నామరూప రహితము చేసితీరుదు"నని వ్రాసి ప్రత్యేకదూతద్వారా దానిని నాటి బొంబాయి గవర్నరుకు కందజేసెను.

ఆనాడు పల్కిన పలుకులను నే డక్షరాలఁ గార్యాచరణలోఁ బెట్టి పటేల్ మహితప్రతిజ్ఞాపాలకుఁ డైనాఁడు.

ప్రపంచము కని విని యెఱుఁగనిరీతిగా సంస్థానముల సమస్యను బరిష్కరించిన యీ ఘనత యాయన కొక కీర్తి కిరీటము.