పుట:2015.329863.Vallabaipatel.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[17]

వల్లభాయిపటేల్

129

మనదేశము చక్రవర్తిక్షేత్రమనియు, నేకైక కేంద్ర ప్రభుత్వ పాలనమున నుండదగుననియుఁ, గౌటిల్యుఁడు నిర్వచించిన లక్షణము నేటికి సర్దారు పటేల్‌ద్వారా సార్థకమైనది.

అస్తమయము

              "కత్తి దొలుచును. ఒర క్షీణించును;
               శరీరము నశించును, ఆత్మ నశించదు."
                                                    -బైరన్.

వల్లభాయిపటేల్ గాంధీజీ యనుచరులలో నన్నిటఁ బెద్దవాఁడు. వార్ధక్యదశలో నిరంతరకార్యనిమగ్నుఁడై యుండుట చేత నాయన యారోగ్యము చెడెను. 1948 నుండి యాయన యనారోగ్యదశలోనేయుండెను. స్వాస్థ్యమునకై మాంటిసోరీలో నివసించుట యవసరమని వైద్యులు వచించిరి. అచట నుండఁగనే హైదరాబాదు కల్లోలము పెరుగుటచే విశ్రాంతి తీసికొనకయే యాయన మఱలఁ గార్యభారము వహించవలసివచ్చెను.

ఆయనకుఁ గార్యభారముతోపాటు వార్ధక్యముగూడ నధికమాయెను. ఆరోగ్యము క్షీణించెను. ఢిల్లీలో నాయనకు సుస్తీ ప్రారంభముకాఁగా, నక్కడి వాతావరణముకన్న బొంబాయి వాతావరణములో నాయన కారోగ్యము చేకూరు నను నాశతో వైద్యుల సలహామీద 1950 డిశంబరు 12 వ తేదీ విమానముమీఁద వచ్చెను. అప్పటినుండియు బిర్లాభవనములోనే యుండెను.