పుట:2015.329863.Vallabaipatel.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
114
వల్లభాయిపటేల్

సాగెను. పాకిస్థాన్‌లో నుండలేమని హిందువులును; భారత దేశములో నుండఁజాలమని ముస్లిములును భయపడఁ జొచ్చిరి. పాకిస్తానంతటను హిందువులహత్య, హిందూస్త్రీలయపహరణ యధికమయ్యెను. లక్షలాది నిరపరాధులు దుర్మరణము నొందిరి. లక్షలకొలదిజనులు తరతరాలనుండి వచ్చుచున్న తమయాస్తిపాస్తులను బ్రియమైన జన్మస్థానమును వీడి 'యలో లక్ష్మణా' యని యితర ప్రాంతముల కేగవలసివచ్చెను.

ఇటుల దేశమంతట రక్తపాతము జరుగుచుండెను. విశేషించి పంజాబులో రక్తపాతము జరుగుచున్న సమయమున నమృతసర్ నగరమున కరిగి హింసకుఁ బ్రతిహింస తగదనియు, బాకిస్థాన్‌కుఁ బోఁదలచిన ముస్లిములను బోనిండని హితవు చెప్పి శాంతినెలకొల్పెను.

కేంద్ర ప్రభుత్వపుటాస్తుల పంపకమువల్ల భారత ప్రభుత్వము పాకిస్థాన్‌కు 50 కోట్ల రూపాయలు చెల్లించవలసి వచ్చెను. పాకిస్థాన్ ప్రభుత్వముకూడఁ గొన్ని కోటు లియ్యవలసియే యుండెను. తా నియ్యవలసిన దీయక, తనకు రావలసిన దానికై పాకిస్థాన్ పట్టుపట్టసాగెను. దీనికి వల్లభాయి కోపోదీప్తుఁడై, 'పాకిస్థాన్‌ తాను జెల్లించువఱకును భారతప్రభుత్వము గవ్వకూడ నీయ'దని యుద్ఘోషించెను. పాకిస్థాన్ పాలకులకుఁ బటేల్ పలుకులు శూలములవలె నుండెను. కొందరు ముస్లిం నాయకులు దీనిని గాంధీజీ కెఱింగించిరి. ఆయన మాటకు మీఱని వాడగుటచే వల్లభాయి యా మొత్తము నిచ్చుట కంగీకరించెను. ఈ సందర్భములో బొంబై నగరమున నాయన పలికిన పలుకులు గమనార్హ ములు.