పుట:2015.328620.Musalamma-Maranam.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
22
ముసలమ్మ మరణము

ల్లనుమటుమాయమయ్యెఁ బ్రజలన్‌ దయఁ జూడుము పార్వతీపతీ
చనువున నన్ను నేలుమని స్నానము సేయఁగనేగె గ్రక్కునన్‌. 98

క. లలనా శిరోలలామం
బలరుచుఁ బసుపునను జలకమాడి తలిర్చెన్‌
దలమీఁది చెట్లు కురిసిన
లలితసుమ పరాగమున వెలయు లతికయనన్‌. 99

మ. ఉరు హారిద్రపుఁజీరసాంధ్యరుచిగా నొప్పార, నానందవి
స్ఫురితంబైన మొగంబు రక్తమయమై సూర్యప్రభంబోల, శో
క రసాధీనజనాళి పుల్గుల క్రియం గాంక్షన్‌ మొఱల్‌ వెట్టఁ దా
సరసీరాజమహాబ్ధికై చనియె విస్ఫారీభవన్మూర్తియై. 100

[1]గీ. అశ్వపాలుండు గొనిపోవ నల్లబాఱు
నదినిగాంచి, మనోహర నాట్యమొప్ప
మెల్లమెల్ల నొయారంబు మీఱఁ గదియు
బాల హరి లీల జనులతోఁ బడఁతియరిగె. 101

వ. అంత నంతరంగ ధ్యానాధిక్యంబునం జేసి. 102

మ. తన దేహంబును, భూమియున్‌, దివము, మార్తాండుండు, నాశాచయం
బును, వృక్షమ్ములుఁ, బక్షులుం, బ్రజలునుం, భూధ్రంబులున్‌, సర్వ
మున్‌ దనకుం దోఁపవ; యెందుఁ జూచిన నుదాత్తంబైన తద్భక్తికా
రణమైయొప్పఁగఁదోఁచు శంకరజలప్రాయాంగసాంద్రద్యుతుల్‌. 103

  1. ఈ పద్యము హోమరను గ్రీసుదేశకవిచే వ్రాయంబడిన ఇలియడ్డను కావ్యమునుండి తెలిగింపబడినది.