పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
69
వెలుగోటి యాచమనాయఁడు

భక్తివిశ్వాసములు గలదండనాయకులు, న్యాయము, ధర్మము దప్పనిభృత్యులు, కోపోద్దీపితులై దుర్మార్గుఁ డైనజగ్గరాయని నాశనము చేయవలయునని నిశ్చయించుకొనిరి. దుర్మార్గుఁ డైనవాఁడు కాలక్రమమున నాశనము జెందకపోఁడనియుఁ బ్రజలఁ బీడించి మోసమున సజ్జను లైనవారి కపకారము జేయువాఁడు తప్పక నాశనమగుననియు, యాదుర్వార్తవినిన వారు తలంచిరి. వీరపురుషు లనేకులు కత్తిగట్టి యాచమనాయనిపక్షమునఁ బూని జగ్గరాయని దునుమాడుదిన మెన్నడు చేకూరునా యనితలంచుచుఁ దగుప్రయత్నములఁ జేయు చుండిరి. సామంతరాజులనేకులు దుర్మార్గుఁ డైనజగ్గరాజును తుత్తునియలుగ నఱికి రంగరాయలుకుమారుఁడు బాలుఁడు నైనరామదేవరాయని సామ్రాజ్యాధిపత్యమున నిల్పి పట్టముఁ గట్ట సంకల్పించి సేనానివహముల సమకూర్పఁ దమ దండనాయకుల కాజ్ఞాపించిరి. దేశములోని ప్రజలెల్లరు రాజకుటుంబమును నాశనముఁ జేసినవాఁడు ప్రజలరక్షించునా యనియుఁ బ్రజల మాయోపాయమున వంచించి పరిపాలింప నెంచినవాఁడు నాశనముగాక మానఁ డనియుఁ దలంచి జగ్గరాయని నాశనము విను దిన మెప్పుడు సమకూడునా యని తలంచు చుండిరి. దుర్మార్గుల నాశనము జేయకున్న లోకము దుఃఖ పరంపరలపాలు గాక మానదని తలంచి సంస్థానములోని వీరు లంద ఱొకటై సేనలలోఁ జేరి యాచమనాయనికి బాసటయై నిలువ సంకల్పించిరి.