పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

వెలుగోటి యాచమనాయఁడు

జగ్గరాయలును నట్టిప్రయత్నమునం దేమరక యనేక మండలాధిపతులను మాయోపాయవిధానములఁ దనప్రక్కకు నాకర్షించు చుండెను. సామ్రాజ్యమున నిరుపక్షములేర్పడినవి. అఱువదివేల సైనికులను జగ్గరాయలును, ముప్పదివేల సైనికులను యాచమనాయఁడును ప్రోగుచేసిరి. ఇందెవ్వరును దక్కనుసుల్తానుల నాహ్వానింప లేదు. వారుగూడ నిందు జోక్యమును గలిగించుకొనలేదు. జగ్గరాయలకు సైన్యమెక్కువగలదని యాచమనాయఁ డెన్నడును భయపడియుండలేదు. సత్యము, ధర్మము, తన ప్రక్కఁ గలదను దృఢవిశ్వాసముతో, నున్నవాఁడు యాచమనాయఁడు. తనకే జయము కలుగునన్న విశ్వాసముతో రామదేవరాయని వేయికన్నులతోఁ గాపాడుచుఁ బదివేలసైన్యములనడుమ నుంచుచు వచ్చెను. వేంకటపతిరాయలు మరణముఁ జెందినవెనుక మూఁడు సంవత్సరములకాల మీతగవులలోఁ గడిచిపోయినది. అనేకపర్యాయములు రామదేవరాయనిఁ బట్టుకొన వలయు నని జగ్గరాయలు యాచమనాయని సైన్యములను దలపడుచు వచ్చెను గాని యాతనికి విజయము సమకూర లేదు. యాచమనాయఁడు తనసైన్యములను మూఁడునాలుగు భాగములుగా విడఁదీసి దగ్గఱగా నుంచుకొనుచు రామదేవరాయ లేభాగమున నున్నదియుఁ దెలియకుండఁ జేయుచు వచ్చెను. రాజబంధువులనేకులు రామదేవరాయలపక్షమును వహించి యాచమనాయనితోఁ జేరిరి. కాని యధిక సైన్య