పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

విశ్వనాథనాయకుఁడు

కాలమున నొక వింతసమాచారముఁ దెలియవచ్చెను. చిరకాలమునుండి దక్షిణహిందూదేశమున సుప్రసిద్ధములైన చోళ పాండ్యరాజ్యములవారు తమలోఁ దా మైకమత్యములేక నిరంతరము పోరాడుకొనుచున్నను దమస్వాతంత్ర్యమునుఁ గోల్పోవక పదునాలుగవశతాబ్దివఱకు నెట్టెటో నెట్టుకొనుచు వచ్చిరి గాని యా శతాబ్దిమొదట తురకలదాడికి నిలువఁజాలక తమ స్వాతంత్ర్యమును గోల్పోయిరి. వాటితోఁ దొల్లింటి వైభవలక్ష్మియుఁ దొలఁగిపోయినది. కాని యాశతాబ్దిమధ్యమున విజయనగరసామ్రాజ్యమునుఁ బరిపాలించు సంగవంశీయులైనరాజు లాతురకలను జయించి యారాజ్యముల రెంటిని తమ సామ్రాజ్యమునఁ గలుపుకొన్నవా రయినను, ఆరాజ్యములకు హక్కుదారు లయినపూర్వరాజవంశీయులనే రాజులనుగా నియమించి వారివలనఁ గప్పములఁ గొనుచుండిరి. అట్లే కృష్ణదేవరాయలకాలమునాఁటివఱకు జరుగుచు వచ్చెను. వీని కడపటికాలమున మధురాపురము రాజధానిగఁ బాండ్య దేశము నేలుచున్న చంద్రశేఖరపాండ్యుని పైదండెత్తి తంజాపురము రాజధానిగఁ జోళరాజ్యము నేలు వీరశేఖరచోళుఁడు పాండ్యుని జయించి వానిరాజ్య మాక్రమించి వానిని రాజ్యమునుండి వెడలుగొట్టి తానే రెండు రాజ్యములను బరిపాలనముసేయ సమకట్టెను. అట్లు రాజ్యమునుఁ బోగొట్టుకొన్నవాఁడై చంద్రశేఖరపాండ్యుఁడు విజయనగరమునకుఁ బాఱివచ్చి రాయలపాదములను దన కన్నీటిధార