పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథనాయకుఁడు

3

యొకనాఁడు చక్రవర్తి కొల్వుకూటమునకుఁ గొనిపోయి యాయన సందర్శనభాగ్యమును లభింపఁజేసి యాయనకుఁ గృతప్రణాముఁ డగు నట్లుద్భోధించెను. ఆ సుందరబాలవిగ్రహమునుఁ జూచినతోడనే యతఁ డొకబలాఢ్యుఁడైన శూరశిఖామణియనియు, బుద్ధిమంతుఁడనియుఁ జక్రవర్తికిఁ దోఁచుటయె గాక రాజకీయపరిజ్ఞాతయై మున్ముం దింకను నభివృద్ధికి రాఁగలఁడను నూహతట్టి యాతని స్వకీయభృత్యునిగ గ్రహించి తమలపాకులు, వక్కలు నందించు సేవకావృత్తియందు నియోగించెను. ఇట్లు వినయనయభయభక్తులతోడ సార్వభౌముని సేవింపుచుఁ దనపుణ్యవిశేషమున నాతనిచిత్త మెపుడును తనయందే లీనమగునటుల ప్రవర్తింపుచుండెను. కృష్ణదేవరాయలు పూర్వ దిగ్విజయయాత్రకు బయలు వెడలినపుడు విశ్వనాథనాయఁ డాతనితోఁగూడ నుండి తనకు నియమించిన నెట్టిదుస్సాధ్యకార్యమునైన నవలీల శూరశిఖామణులు మెచ్చునట్లుగాఁ జేసి విజయమును గొనుచు సర్వజనసంశ్లాఘనకుఁ బాత్రుఁడగుచు వచ్చెను. ఈ దండయాత్రలో నీతఁడు సూపిన పౌరుషపరాక్రమములే 1520 వ సంవత్సరమున రాయల రాయచూరుదండయాత్రలో నొక సేనానిగఁ బాల్కొనుట సంభవింపఁజేసెను.

కృష్ణదేవరాయలవారు కటకము మొదలుకొని కన్యాకుమారిదాఁక దేశము లోపఱుచుకొని విజయనగరసామ్రాజ్యము నవక్రపరాక్రమముతో నేలుచు సుఖసత్కధావినోదములతో విజయనగరమునఁ బ్రొద్దుపుచ్చుచున్న కడపటి