పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

విశ్వనాథనాయకుఁడు

మున కీతఁడు గాంచినది యుపకృతిని మఱువక కృష్ణదేవరాయలు విశ్వాసపాత్రుఁ డయిననీతనియెడ నధికప్రేమను జూపుచుఁ దన 'తోషేఖానా' (ధనాగారము) కధికారిగ నియమించెను. కృష్ణదేవరాయలు విజనగరసామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుఁడు గాకపూర్వమె నాగమనాయఁడు తనకు సంతానము గలుగ లేదని పరితపింపుచు నూఱుదేవుళ్లకు మ్రొక్కుచు, పుణ్యయాత్రలు సేవింపసంకల్పించి, కాశీ క్షేత్రమున వెలసియున్న విశ్వేశ్వర దేవుని సందర్శింపవలె ననుమనోనిశ్చయముతో నొకనాడు తన మనోవాంఛితమును ప్రభువునకు విన్నవించి యాతనియనుజ్ఞఁ బడసి తనయుద్యోగ భారము నంతయు దన మిత్రుఁడైన రామభద్రనాయనిపైఁబెట్టి కాశీయాత్రకుబయలుదేఱి వెళ్లెను. అట్లు బయలుదేఱి సురక్షితముగా గొంతకాలమునకుఁ గాశీనగరముఁ బ్రవేశించి గంగను సేవించి గంగాస్నానమువలనఁ బునీతుఁడై విశ్వేశ్వరదేవునికి నమస్కరించి విధ్యుక్తవిధానములఁ బూజించి మరలి వచ్చినతరువాత గొంతకాలమునకు నీతనికొక్క కుమారుఁడు గలిగెను. ఈ కుమారుఁడు విశ్వేశ్వరుని వరప్రసాదమునఁ బుట్టినవాఁడను విశ్వాసముతో నీతనికి విశ్వనాథుఁ డని నామకరణముఁ జేసెను. ఈతనికి వయస్సు పెఱిఁగిన కొలఁది సుందరాకృతియుం దీనితోఁబాటు దేహబలధీబలమనోబలంబులు క్రమముగా వర్థిల్లుచున్నందునఁ దండ్రి సంతోషముతోఁ దగు విద్యనుగూడఁ జెప్పించెను. ఇతని కిరువదియేండ్లు రాకపూర్వమె