పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథనాయకుఁడు.

పదునేనవశతాబ్దాంతమున దక్షిణహిందూదేశమునఁ బ్రవర్థమానమై వెలుంగుచుండిన విజయనగరసామ్రాజ్యమును సాళువ నరసింహరాయలవా రప్రతిమాన ప్రతాపాధ్యులై పరిపాలనము సేయుచుండ నాచక్రవర్తికార్యకర్తలలో నొక్కండుగానుండి పే రెన్నికగాంచినవాఁడు కోట్యము నాగమనాయకుఁడు. పవిత్రపుణ్యక్షేత్ర మగుకాంచీపుర మీతని జన్మస్థానము. ఇతనిది కాశ్యపగోత్రము; బలిజ కులము. ఈ తెలుఁగునాయఁడు చక్రవర్తిసైన్యమున కధ్యక్షుడును, కార్యకర్తలలోఁ బ్రముఖుండును, తుళువవంశదీపకుండును నగునరసనాయనికిఁ జేదోడు వాదోడుగా నుండి సామ్రాజ్యముపట్ల వైరవభావముతోఁ బ్రవర్తించెడు చోళ పాండ్య రాజులపై నతఁడు దండయాత్ర వెడలినప్పు డాతనితోఁగూడ నుండి సామ్రాజ్యమునకు విజయవైభవముల సమకూర్చి మన్ననకుఁబాత్రుఁడైన నేస్తగాఁడు. ఇంతియ గాక సాళువ నరసింహరాయల మరణానంతరము సామ్రాజ్యము తుళువ వంశమువా రాక్రమించుకొనుటకుఁ బ్రయత్నించినపుడు సర్వవిధములఁ దోడ్పడిన దండనాథుఁడు. తన వంశ