పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

వెలుగోటి యాచమనాయఁడు

రాజును, శ్రీరంగరాజును నై యుండిరి. కొందఱు రాజ బంధువులును, కొందఱుమండలాధిపతులును తిరుమలరాజునే యువరాజుగ భావించి యట్లు ప్రశంసించు చున్నను, తిరుమల రాజు మొదటనుండియు రాయలయాజ్ఞలను మీఱుచు నవిధేయుఁ డై ప్రత్యర్థులతోఁ జేరి సామ్రాజ్యప్రతిష్ఠకు భంగము కలుగురీతిఁ బ్రవర్తించుటవలన నాతనియెడ నసహ్యత జనింప నతనితమ్ముఁడును, గుణవంతుఁడును స్ఫురద్రూపియు నగు శ్రీరంగరాజునే దగ్గఱకు జేరదీసి యువరాజుగఁ జేసెను. ఆకాలమునాఁటి పోర్చుగీసుపాదిరులు తిరుమలరాజునెడఁ దమకుఁ గలమైత్రి ననుసరించి రాయలతో జరుపు నుత్తరప్రత్యుత్తరములలోఁ దిరుమలరాజునే యువరాజుగ భావించి ప్రశంసలు సలుపు చుండఁగా నాతఁడు గర్హించు చుండెనని తెలుపుచున్నారు. తనయెడ నిట్టివైమనస్యము కలిగి యుండుటచేతనే శ్రీరంగపట్టణము రాజధానిగాఁ గర్ణాటసామ్రాజ్యమును రాజప్రతినిధిగాఁ బరిపాలనముఁ జేయుచున్న తిరుమలరాజు రాయలయుత్తరువును శిరసావహించి 1610 లో రాజ్యమును రాజుయొడయరున కప్పగించి శ్రీరంగపట్టణమును విడిచిపోయెనని చెప్పుదురు. ఇట్లు తిరుమలరాజు సిగ్గుమాలినవిధముగాఁ బ్రవర్తించుటవలన మండలాధిపతు లెవ్వరును వానిపక్షమును బూనికొన సాహసింపలేక పోయిరఁట.