కాళిదాస చరిత్ర
నీవెవడవన్న రాచకొడుకునని చెప్పుము. రాజపుత్రికను నీవు చూచి నప్పుడు 'త్రిపీడా పరిహరోస్తు ' అని దీవింపుము" అని యుపదేశించి యా మాటల నాఱుమారులు వల్లింపజేసి వానిని దనవెంట బెట్టుకొని ధర్మవర్దనికడ కరిగి యాతనింజూపెను. దొమ్మరి కుఱ్ఱవాడు లేబ్రాయమం దుండుటచేతను,యాజ్ఞపవీతములు ధరించుటచేతను మేధానిధియిచ్చిన మంచివస్త్రములుఇ గట్టుకొనుటచేతను, నప్సరస కడుపున బుట్టినందున, సహజముగ స్ఫురద్రూపి యగుటచేతను, రాజు వానింజూచి సంతసించి యేయేశాస్త్రముల నితడంభ్యసించెనని మేధానిధి నడిగెను. అడుగుటయు మేధానిధి "రాజా! ఇతని వృత్తాంతమంత నెఱిగించెద వినుడు. ఇతడు సుక్షత్రియుడు తల్లిదండ్రులు చిన్న నాటనే మృతినొందిరి. ఈతడు కొందఱు బ్రాహ్మణోత్తము లకు శుశ్రూషజేసి చతుశ్శాస్త్రములయందు మేరలేని పాండిత్యము సంపాదించెను. సకల పుణ్యక్షేత్రముల సేవించి, స్నాతకవ్రతముచేసికొని, వివాహమాడుటకు సిద్ధముగా నున్నాడు. కాని, వివాహమగువఱకు నెవ్వరితొడను మాటలాడనని మౌనవ్రతదీక్ష బూని యున్నవాడు తనకు తోచినప్పుడెప్పుడైన నొక్కొక మాటాడుచుండును" అని విన్నవించెను. రాజు వాని పాండిత్యమెట్టిదో తెలిసికొనవలెనని కోరెనుగాని మౌన వ్రతమతని కడ్డువచ్చెను. అంతలో నా పెండ్లి కొమారుడు సబాభవనమున గట్టబడిన యొక బొమ్మలోనున్న రా వ ణ విగ్రహమునుజూచి "రాభణుడా" యనెను. ఆపలుకులువిని సభాసదులు రాజును మిక్కిలి యాశ్చర్యమొంది "చతుశ్శాస్త్ర పండితుడేమి యిట్లుపలుకుటేమి" యని తమలో దాము వితర్కించుకొనిరి. అది గ్రహించి మేధానిధి "ప్రమాదము సంభవించినదిగదా! ఈమోటముండా కొడుకు నోరుమూసికొని యూరకుండడు. కుక్కతోక వలె వీనిమనస్సెంత సరిచేసినను సరిగా నుండదు. అయినను నేను దీనిని సమర్దింపజాలనా!" యని