ఈ పుటను అచ్చుదిద్దలేదు
135
కాళిదాస చరిత్ర
సేవకురాలగు తరంగివతి యనుదానిని వారు పిలిచి దానికి దగిన బహుమానములిచ్చి బ్రతిమాలి కాలిదాసు నెట్లైన దేశమునుండి వెడలుగొట్టునట్టి యుపయము బన్ని రాజున కతనిపై ద్వేషము కలిగింపుమని చెప్పిరి. "నాకొక ముత్యాలహారము మీరిచ్చినపక్షమున నే నీ పని దప్పక చేసెద" నని యాతాంబూలవాహిని ప్రత్యుత్త రమిచ్చెను. బండితు లెట్లో మౌత్తికహారము సంపాదించి దానికిచ్చిరి. అది సంతోషించి సమయముకొఱకు నిరీక్షించుచుండెను.
ఒకనాడు రాజు పండుకొనియుండ తాంబూలవాహినియగు తరంగవతి నరపాలునకు బాదములొత్తి తనకు నిద్రవచ్చినట్లు నటించి మంచము క్రింద బండుకొని తెలిసియుండియే యిట్లుపలవరించెను. "ఓసీ! మదనమాలినీ, దుర్మార్గుడైన యాకాళిదాసు దాసీవేషముతో నంత:పురముంబ్రవేశించి లీలావతీ దేవితో రమించుచున్నాడు" రాజునకు సరిగా నిద్రపట్టకపోవుటచే నామాటలువిని యదరిపడి లేచి "తరంగవతీ! మేలుకొన్నావంటే" యని యడిగెను. అది గాఢ నిద్రపోతున్నట్లు నటించి ప్రత్యుత్తరమీయక పోయెను. అప్పుడు రాజు తనలో నిట్లు వితర్కించెను. "ఈతరంగవతి నిద్రయందు కలగని మునుపెఱిగిన దగుటచే దేవియొక్క దుశ్చరితమును బలరించు చున్నది. కాళిదాసు స్త్రీవేషముతో నంత:పురము బ్రవేశించుచున్నాడన్నమాట నమ్మదగినది. ఆడు వాండ్ర గుట్టు నెవ్వడెఱుగలడు?" అట్లు వితర్కించి రాజు మఱునాడు తనకు జ్వరము వచ్చినదని పండుకొని కాళిదాసును బిలిపించి యతడు వచ్చిన తరువాత లీలావతీదేవినిగూడ బిలిపించి "దేవీ! ఇప్పుడు నాకు పధ్యము దెప్పింపు"మని పలికెను,.మంచిదని దేవి లోనికరిగి పధ్యము దెప్పించి వెండిపాత్రలో నన్నము పెసరపప్పు వడ్డించెను. వారి యబిప్రాయముల దెలిసికొనవలెనని రాజొక శ్లోకములో రెండుపాదములు రచించి యిట్లు చదివెను:--