పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

85

మయినది. ఇందుచేతనే వీరు శాస్త్రీయ వివాహమును, రిజిస్ట్రీ మేరేజిని — రెంటిని గూడ నంగీకరించినారు. పైగా గొందఱు జాతిమతవిచక్షణతో నిమిత్తము లేకుండ జరిగిన పెండ్లికూడ శాస్త్రీయమే యని నిరూపింప బ్రయత్నించుచున్నారు. కాని దానివలన బ్రయోజన మేమియు లేదు. ఏలయని హిందూ కోడును బట్టికూడ ఆ పెండ్లి యధార్మికమే యగును. యాలోచించదగు విషయమేమనగా హిందూధర్మమునుగాని, శాస్త్రములనుగాని యాదరింపక వ్యతిరిక్తాచరణము జేయు వాడుకూడ హిందువుడే యగునా? ఒకవేళ హిందువుడే యైనచో కోడుబిల్లు హిందూధర్మమును రక్షించునది యని భావించు టెట్లు ? హిందూధర్మమును, హిందూ శాస్త్రములను, హైందవాచారములను ఉపేక్ష చేసి విరుద్ధముగ నడుచుకొను వాడుకూడ హిందువుడే యైనచో కూతురును బెండ్లాడిన తండ్రియు, సోదరిని బెండ్లాడిని సోదరుడుకూడ హిందువులా? కాదా ? యనికూడ ప్రశ్న వేసుకొనవలసి వచ్చును. వారు కూడ హిందువులే యనినచో, నట్టి విషయములు కూడ హిందూకోడుయందున్న వన్న మాటయే.

ఈస్థితిలో మహావీరత్యాగి వేసిన ప్రశ్నయే బాగుగ నున్నది. ఏమని యనగా " అంతఃకరణముయొక్క ప్రేరణయే మాన్యమయిన స్థితిలో నెవడైన మతాంతర వివాహము కూడ జేసుకొనవచ్చునా ? " దీని కేచ్చటను సమాధానము గాన్పింపదు వాస్తవమున నిది యొక యనర్థము. శాస్త్ర ములను ధర్మములను దీసి యావల బెట్టుడని ప్రోత్సహించు