పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

హిందూకోడ్ బిల్ సమీక్ష


'నిది నాపుత్రిక, ఇది ఒరుని యాహారము లేక ఈ యాహారమును మనము తాకకూడదు' అను విచారములుండవు. అయినను వాటియందు భయంకర సంఘర్షము జరుగుచునే యుండును. కావున నాచార విచారములందు భేదమున్నను సద్భుద్ధి, సద్భావనలద్వారా సంఘీభావమును, ఐకమత్యమును స్థాపించవీలగును, పలువురు సైనికులు పలురకముల శస్త్రాస్త్రములతో పలువిధముల యుద్ధములు చేయుదురు. వారి వారి స్థానములు కూడ వేరువేరుగ నుండును. అయినను వారి లక్ష్య మొక్కటి యగుటచే వారిలో తప్పక సంఘటనముండియే తీరును. అట్లే శాస్త్రమర్యాదలను బట్టి యాచార విచారము అందు భేదమున్నను, సద్భావన ద్వారా ఐకమత్యము సమ కూడగలదు.

హిందువుల యొక్క యవాంతరజాతులు నశించిపోయి నను మహమ్మదీయాది జాతులుండనే యుండును. వాటితోడ గూడ మైత్రి పొనగవలసిందే కదా! బుద్ధిమంతులు, స్వధర్మ పరాయణులు, విశ్వసనీయులు నగు హిందూ మహమ్మదీయు లలో నైకమత్యము పొసగిన పొసగవచ్చును. కాని బిల్లును బట్టి శాస్త్రధర్మ విశ్వాసము లేక, స్వధర్మపరాయణత లేక, నొక విధమగు విశ్వాసము లేకయు నుండు హిందువులలో పారస్పరికముగ నైకమత్యము కుదురు టసంభవమై పోవును. తండ్రీకొడుకులకు, అన్న చెల్లెండ్రకు, భార్యాభర్తలకు కేసులు దావాలు మొదలగునవి బయలు దేరుటే యీ బిల్లు యొక్క ముఖ్య ఫలితము.