పుట:హాస్యవల్లరి.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముక్కుమీద కట్టుకట్టుగుని ఉంది. మరొక అమ్మాయి బండిలో ఉంది. ఆ అమ్మాయిని కూడా దిగమని సంజ్ఞ చేసి, మువ్వ దింపింది.

స - (మువ్వ మొహంకేసి ఆశ్చర్యంగా చూసి) అదేమిటమా!

ము - (మాట్టాడకుండా కొత్తపిల్లకేసి చూపెట్టింది.)

స - (కొత్తపిల్లతో) నువ్వు కొట్టావా ఏమిటమ్మా మా అమ్మాయిని?

కొ - అంత పశువునాండీ?

స - మా అమ్మాయి మాట్లాడదేం మరీ!

కొ - అసలు నేను వద్దంటూనే ఉన్నానండి.

స - ఏం జేసిం దేం జేసింది?

కొ - తన ముక్కు చివర చిన్న ముక్క ఓటి కత్తిరించి దూరంగా పారేశింది, వెతికి తెచ్చి అతకడానికేనా వీల్లేకుండా!

స - అయ్యొ! అదేమీ?

కొ - మొదట మేం ఇద్దరమే వాదించుకున్నాం అనుకోండీ! తరవాత వెళ్ళి మధ్యవర్తుల్ని అడిగాం.

స - ఏ విషయం?

కొ - మా యిద్దర్లో అందకత్తె ఎవరూ అని? ఎవర్నడిగిచూసినా, మీ అమ్మాయే అందమైందన్నారు.

స - లేకపోతే నిన్నంటారని ఎల్లా అనుకున్నావ్, పిడకమొహం తల్లీ! నువ్వేమన్నావ్?

కొ - చెప్పేదోటి, చేసేది మరోటీనా అన్నాను.

స - అనగా?

కొ - రూపం ఎప్పుడూ తనకే ఉంచుగుంటే, సమత్వం కబుర్లు కట్టెయ్యమన్నాను. .

స - ఏడిసినట్టే అన్నావు తల్లీ? ఇంకోరి రూపం నీ కెల్లావస్తుంది. ఎడ్డిమృగానికీ! నీ మాటలో సబబుండాలా?

ము - అందకనే నే నీపని చేశాను నాన్నా! నా రూపానికి వికారం వచ్చేసింది గనక ఈవిడరూపానికి అందం బయల్దేరేసింది. ఇంటోకి పదండి, (ఆవిడతో) రావమ్మా! రాంభాయమ్మా! కాఫీ పుచ్చుగుని వెడుదుగాని!

స - (నాతో) ఎంత చిత్రంగా తయారయారో చూశారా! సంతానాన్ని కన్నవాళ్ళని ముక్కూ చెవులూ తెగొయ్యాలి.

నే - నాసికాగ్రత్యాగం సంతానాలే చేస్తూంటే, తల్లిదండ్రులకి కర్ణఖండన చాలనుకుంటాను. 'సమాసమీ' గారు ఈ విషయంలో ఏమంటారో!

స - ఏమో! వారి మొహం అంటారు, వారి మొహం వారి మోరానూ!

అని సవారినాధంగారు పత్రిక తీసి, చింపి, ముక్కలు చేసి నార చల్లినట్టు చల్లేశారు. వీథిగేటు దాటి ఇంటి ఆవరణలో మొక్కలమధ్య తీర్చి కట్టిఉన్న 'ఆర్చి' కింది బాటమీద నాలుగడుగులు వేశాం.

నే - నాకు సెలవా?

స - అబ్బ, రస్తురూ! కాస్సేపు కూచుని వెడుదురు గానీ?

అనడం ముగియకుండనే, భంట్రోతు ఎదటిహాల్లోంచి పైకివచ్చి,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

179

హాస్యవల్లరి