పుట:హాస్యవల్లరి.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భం - అయ్యగారండి! పెద్దబ్బాయిగారికి ఆస్ట్రేషన్ అయిందండి. ఆర్నీ, ఆ ఇంకోఅబ్బాయినీ ఇప్పుడే ఉత్తరపు గదిలో పడుకోపెట్టి ఎల్లిపోయారండి, డాక్టరు!

స - (ఖంగారుగా) అయ్యొ! ఆపరేషనా?

భం - మరేనండి.

స - ఇంకో అబ్బాయా?

భం - మరేనండి. మరో అబ్బాయి?

స - బాఘా దెబ్బలు తగిలాయా ఇద్దరికీ? సైకిల్ సరసంగావును.

భం - కాదండి.

స - మరి!

నే - శంఖయ్యకాదూ మీ పెద్దబ్బాయి?

స - అవునండి,

నే - ఏమన్నా జబ్బుగా ఉందా?

స - లేదండీ! పట్నంనించి సెలవలకివచ్చాడు వారమాయె. (భంట్రోతుతో) కొట్టుగున్నారా ఏమిట్రా, కర్రలుచ్చుగునీ! ఎదీ! ఆగదిలోకి వెడదాం నడు.

భం - రేపు ఉదయందాకా ఆర్ని మాట్లాడించ కూడదంటండి, డాకటేరు అన్నారు.

స - హోరి! అల్లాయితే అసలు ఆపరేష నేమిట్రా దిక్కుమాలాడా!

భం - అబ్బ, ఏటండీ, నన్నంటారూ! బుర్రకాయ ఆప్రేషనా, బుర్రగుంజో, అదేదోటండీ! ఎళ్ళి డాక్టర్ని తీసుకొచ్చేదా! ఆరుకొత్తోర్ట.

స - అబ్బ, వాడెక్కడున్నాడో ఇప్పుడూ! అబ్బాయి కులాసాగా ఉన్నాడా, పోనీ?

భం - నవ్వుతూ ఉన్నారండీ.

స - స్పృహ ఉందా?

భం - అబ్బే, చా, పిక్కలా గున్నారండీ.

స - (నాతో) వీడెవడో అఖండ డాక్టర్లా ఉన్నాడండోయ్!

నే - లేక ఒకవేళ, ఖండ డాక్టరేమోనండి...

స - ఏంరా? ఇంకా ఏం జేశాడు ఆ డాక్టరు?

భం - అబ్బ, నాకు తెల్దండి, ఈరి బుర్రలో ఉండే గదులమద్దిన కొలపుల్లతో సూత్తే తొంబయి పెగ్గెలున్నాయంటండి. మరో అబ్బాయికి పదే ఉన్నాయంట. ఈ అన్నాయం తీసెయ్యాలని పెద్దబ్బాయిగారి పట్టంట! యెంట్నే యీ ఆప్రేషనయింది. అబ్బాయిగారి బుర్రలోకి కపాళం పక్కమ్మటే బెమ్మరంధ్రంలో పిచ్చిగారి పోనిచ్చి ఓ నలభై పెగ్గెలు పైకి ఎగజుర్రి లాగేశారంట, ఆ సేత్తోనే ఆ ఇంకోఅబ్బాయి బుర్రలోకి, అయి, 'ఇండీషన్' చేశారంట! రేపటుదయానికి ఇద్దరికీ ఓటే తెలియీ, ఓటే పెగ్గా, ఓటే మాటా, ఓటే గ్యాపకం, ఓటే అబిప్పరాయం , ఆ, ఓటే కమామీషూ ఉంటాయట! వారం ఆగి మరో ఆప్రేషన్ చేత్తే, ఆ యింకో అబ్బాయికే తొంబయి పెగ్గెలూ, మన పెద్దబ్బాయి గారికి పదీ అయిపోతా యంటా! (గారాం నటిస్తూ) అయ్య గారండీ! మీ పెగ్గెలు నాకు 'ఇండషన్' చెయించరండీ, మల్లీ ఆ డాకటేరు తోకముడుత్తాడేమో!

స - (నిర్ఘాంతపోయి, నాకేసి చూసి) చూశారా, వీడి కోరికలు!

నే - (యాదాలాపంగా, భంట్రోతుకేసి చూసి) వాడు కోరుకోతగ్గవాడు, మీరు చెల్లించ తగ్గవారు.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

180

హాస్యవల్లరి