పుట:హాస్యవల్లరి.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకోడు పెసరపప్పు తెచ్చాడు. సరి ఓబయ్య ఉప్పు కొనుక్కొచ్చాడు. కాని మా ఊరికి కొన్ని మైళ్లదూరంలోనే ఓ యేరు దాటాలి. అది దాటడంలో చిన్న అవాంతరం ఓటి తప్పిందిగాదు. అసలే అది చిన్నడింగీ, ఆవకాయ పెచ్చులాగా! పైపెచ్చు, ఓబయ్య అందులో అడుగున పడుకుంటే తూకంగా ఉండునా, ఓవేపు అంచుమీద కూచ్చున్నాడు, మహా! నట్టేట్టోకి వెళ్ళేసరికి, అచ్చయ్య వతనప్రకారం ఉత్తపుణ్యానికి ఓబయ్యని తిట్టుగోడం మొదలెట్టాడు. ఎప్పుడూ లేంది ఓబయ్యకి కొంచెం కోపం వచ్చింది. ఆపళంగా అచ్చయ్య డింగీ రెండంచుల మీదా రెండుచేతులూ పెట్టి, అది ఈ వేపుకీ ఆవేపుకీ ఒరిగే లాగు ఉయ్యాలా ఊగించాడు. డింగీ అల్లానే ఊగుతూ అద్దరికి అహోరించింది గాని, ఓబయ్య కూర్చున్న వేపుకి గోవిందాయిస్వాహా అని చెప్పి పల్టీ కొట్టింది. అంతా ఏట్లోపడ్డారు. ఏమడిగారు అవస్థ! ఓబయ్య ఊబిలో తల్లగిందులుగా కూరుకుపోయాడు. పాపం వాడికి ముక్కులోకి పాలు దిగాయో తేదోకాని ఇంత బురదమట్టుకు దిగింది. వాణ్ణి కప్పీలు లేకుండా పైకి ఊడదీసేసరికి మాతాతలు దిగొచ్చారు, బస్సుమీద! యాత్ర సరుకులికి మారురూపం వచ్చింది. అప్పడాలు కుక్క చెవులులా ,అయినాయి. ఒక్కొక్కవడియం కందదుంపలా తయారయింది. ఓబయ్య ఉప్పు ఏట్లో కలిసిపోయి రూపం లేకుండానే పోయింది. తడిబట్టలే మూట కట్టుగుని, ఒక్కొక్కబట్టమాత్రం పిడిచి ఒంటి మీద వేసుగుని, రాంబందుల్లాగ రెక్కలాడిస్తూ నడిచిపోయాం . ఓబయ్యని వెనక్కి వెళ్లమన్నాం . అబ్దాంతమైనా వాడు వెళ్లనన్నాడు. వెనక్కీ నిష్క్రమించక, కూడారాక, ముందుకీ సాగక, మమ్మన్ని వాడు కొరుక్కుతిన్నాడంటే నమ్మండి. నాని తగులడ్డ ఆ పదార్థాలే మహరుచిగా ఉన్నాయంటూ మా వాళ్లు, మొదటిమజిలీ జేరకుండానే, అవన్నీ ఊదిపారేశారు. అలానే, కొంతదూరం నాటునా, కొంతలెక్కరైలు మీదా, కొంతమేర అడివిలోనూ, భోజనానికి సహళగడ్డీ కరుస్తూ క్షేమగిరి చేరుకున్నాం. అక్కడ సత్రాల్లో ఏదో ఇంత మృష్టాన్నం స్వీకరిస్తూ కొంతకాలంపాటు స్థాయిపడదాం అనుకునేసరికి, ఆ ప్రాంత్యాన్ని అప్పుడు చాలా జాడ్యాలని మాకు రెండోనాడే తెలిసింది. వెంటనే ఇంటికి దారి తియ్యకపోతే ఉరెట్టుగుంటానని కూచున్నాడు, మమ్మల్ని ఇల్లు బయల్దేరగొట్టిన ఓబయ్య! రెండోనాడు మధ్యాహ్నం సత్రాల్లో వంటలవాళ్ళు కట్టుకట్టి మానేశారు. ఆ రాత్రి మాకు అన్నానికి, ఆటంకం తగిలింది. కాని, మాసత్రం పక్కింటి ఇల్లాలు ఆరోజునే నందికేశ్వరుడు నోం చేసుగోడం చేత (పదార్థం చలిమిడి అని తెలిస్తే, ఛీ అని ఊరుకుందుం) నోం వస్తువు గార్లని రూఢికబురు తెలిసి, గార్లు సాయంత్రందాకా చెల్లకపోడం ఏమిటి చెప్మా అని అనుమానిస్తూనే అస్తమయం కాకుండా వెళ్లాం. అవి ఉప్పుమయం. కాని ఎంజెయ్యం? అవే పూటుగా పట్టించి మర్నాడు బిచాణా బండి ప్రయాణంవల్ల ఒళ్ళు తిరుగుతుందని చెప్పి అయితేం, ఎత్తేసెయ్యడం ఖాయపరిచాం. రైలుఖర్చుకి జంకి అయితేం, రకం మార్చడంలో ఉండే సరదా వల్ల అయితేం, వచ్చినదార్నే వెళ్లడానికి మాలో చాలా మంది ఇష్టపడలేదు. మరోదారీ ఉంది కాని, ఆ దారిని పడితే క్షేమగిరినించి యాభైమైళ్లు అడివి తొక్కితేనే గాని కంకర దర్శనం కాదు. ఈ దారిలో సింహాలు గట్రా ఆహ్వానం ఇస్తాయేమో, ఈదారి వద్దని నేను అన్నాను, అనడం అంటేం! రామయ్య కామయ్యలు (వాళ్ళు అసలు సింహపు బొమ్మేనా చూడలేదు!) అందుకు ఒప్పుకోక, ఒకవేళ సింహమే యెదురుపడితే, దాన్ని పబ్లికుగా పట్టుగుని, ఇద్దరూ దాని నోరు విడగొట్టి, చెరోదవడా దబాయించి దాన్ని తాటికమ్మ చీరినట్టు చీరుతాం అనిన్నీ,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

126

హాస్యవల్లరి