పుట:హాస్యవల్లరి.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అథవా అట్లా స్వాధీనం కాని పక్షంలో దాని నోరు వెలక్కాయి నొక్కినట్టు నొక్కేస్తాం అనిన్నీ భరవసా ఇచ్చారు. అంటే, స్వంత మనుష్యులు నలుగురు కూడా ఉన్నప్పుడు పరాయివాడి మీద ఎగరడం లాంటిదే అనుకున్నారు సింహంతో పని! ఏమైతేం? నడకదార్నే వెళ్లడం నికరపరుచుగుని, అందర్నీ ఝాంతెల్లారకట్ల ఓబయ్య లేవగొట్టే పద్ధతికి అందరూ ఒప్పుగుని, ఆ రాత్రి కునికాం.

గారెలగుణమే గావును, వాటిమొహం ఈడ్చా, మాలో ఒక్కడికీ మళ్లీ స్మారకంలేదు. నేను లేచేటప్పుటికే వెలుగొచ్చింది. నేను అచ్చయ్యని లేవగొట్టాను, వాడెళ్ళి " ఇదేట్రా, మమ్మల్నీ పెంద్రాళే. లేవగొట్టడం?" అని ఓబయ్యని వీపుకి సరిబడ్డ చరుపు చరిచాడు, అట్టుఊడేట్టు. దాంతోటి వాడన్న మాటేమిటి, అంతా కూడా లేచి కళ్లు నులుముకుంటూ బయల్దేరారు. మేం ఊరవతలికి వెళ్లేసరికి కరకరా సూర్యోదయం అయింది. దారి దక్షిణం వేపుకి ఉంది. అది దొరకపుచ్చుగుని మేం నోరు మూసుగుని నడుచుకుంటూ కొన్ని మైళ్లు వెళ్లేసరికి, ఓవాగు ఎదురైంది. అక్కడ కాలకృత్యాలు తీర్చుకుని ప్రయాణం సాగించాం. ఓబయ్యకి భయమో ఏం ఏడుపో, వెనకాల దిగడకుండా మాతో కలిసి ఇదవాలని వాడు ఏకపరుగు. అసలు, వేసం కాలం ఓమూలనించి తరుముకొస్తోంది. చరచరా పొద్దెక్కుతోంది, ఎండా పేల్చి పోస్తోంది. తొమ్మిది గంటలైంది. చాటంతేనా మబ్బు లేదు. ముచ్చెమటలూ పోశాయి. ఒక్క ఓబయ్యకి మాత్రం గొడుగుంది. అది వాడొక్కడూ వేసుగున్నాడు. అచ్చయ్యకి ఓబయ్యని చంపెయ్యాలన్నంత దుద్ద బయల్దేరింది. అక్కడికీ వాడుకూడా దాల్లోనే దూరాలని చూశాడుగాని, తను మరీ పొడుగవడంచేత బెత్తాల మొనలు తనతలకి గుచ్చుగోడం మొదలెట్టాయి. ఆమట్టున వాడికి కోపం ఎగేసుకొచ్చి, వాడు ఆ గొడుగు తాలూకు ఎనిమిద బెత్తాలూ విరిచి, మానలుగురికీ పక్షపాతం లేకుండా రెండేసి చొప్పున పంచిపెట్టి, గొడుగుకామ తనుచ్చుగుని, మరి మిగిలిపోయిన ఆ గొడుగు గుడ్డ ఓబయ్య నెత్తికి పాగా చుట్టాడు. ఇంకోడికి లేకపోవడం, తనకి ఉండడం అనుకున్నాడు గావును అచ్చయ్య, అంతటితో శాంతించాడు. ఎవడిమట్టుకి వాడు వొఠ్ఠి తోటకూర కాడలాగ వేళ్ళాడిపోడం మొదలెట్టాడు, అందులో, పొద్దున్న మంచి మాట చేసుగు ఇదయామా, ఏమన్నానా! ఎక్కడా కనుచూపులో చెట్టు కనపడక ఊరుకున్నారు గాని లేకపోతే ప్రతీవాడికీ సాగారాలని లోపల ఉంది. మేం అఠాత్తుగా ఓమళుపు తిరిగేసరికి, అక్కడ, దారి మూడు పాయల కింద చీలి ఉంది. ఎటువెడితే ఎక్కడికెడుతుందో మాలో ఎవడూ ఎరగడు. అచ్చయ్య చుట్టుపక్కలు చూసొస్తానని తూరుపుదిశగా వెళ్లాడు. కొంతసేపు ఆ యెండలో మేం అల్లానే పడిఉన్నాం. ఆపళంగా, పడమటి దిక్కునించి ఓ సింహగర్జన వినిపించింది. ఓబయ్య మూర్చిల్లాడు. మేం చెల్లాచెదరై దాక్కున్నాం. కాస్సేపటికి అచ్చయ్య గర్జన వినిపించిన వేపునించేవచ్చి " ఏంరోయ్!” అని కేకేశాడు. మేం వచ్చాం, “ఏరి రామయ్య కామయ్యలూ! ” అన్నాడు అచ్చయ్య. అని, “మీకు కనపడకుండా, అల్లా తిరిగి ఈ వేపుకివచ్చి నేనేరా కూసిందీ!” అన్నాడు. అప్పుడు రామయ్య కామయ్యలు పడిపోయిన ఓబయ్య కాళ్లకింద దొరికారు, మేం చెవుల్లో కొంతసేపు ఊదగా వాళ్లకి స్పృహ వచ్చింది. మాపని అంతే అనుకున్నాం. జానికిరామయ్య కొన్ని దర్భలు జాగ్రత్తపడితే ఉత్తరోత్రా నయం అన్నాడు. కాని, దక్షిణాన్నించి ఓ గుర్రం మావెంపుకి వచ్చింది., దాని మీద ఓ గిరజాలాయన గొడుగేసుగుని, కూర్చున్నాడు. ఆయన మమ్మలి సమీపించినా, గుర్రం దిగలేదు,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

127

హాస్యవల్లరి