పుట:హాస్యవల్లరి.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడు - సరేనండి, చిప్పలుకడిగిన నీళ్లతో చేసిన కాఫీ మీ కివ్వడం ఈ వేళనించి నేనూ మాన్తాను.

148

నరుసు - ఏమయ్యా, ఆదెయ్యా! సూర్యం, చంద్రం, కాంతం, ముగ్గురూకూడా ప్రభాదేవిని వరిస్తున్నారు గదా, వీళ్ళల్లో అదృష్టవంతు డెవడవుతాడో!

ఆ - అదృష్టవంతుడు కనపడడు గనక ఎవడవుతాడో చెప్పలేను కాని. ఆవిడ సూర్యాన్ని పెళ్ళి చేసుగుంటుందని తెలుస్తుంది.

149

ఒకచోట జరుగుతూన్నది కొత్తవాళ్ళ పాట కచేరీ యేమో అనుకుని లోపలికి వెళ్ళి, ఇంతాచేసి ఆ పాడుతూన్నది తనకి పూర్వపరిచిత అయిన చంద్రకళయే అని గ్రహించి, తీరావెళ్ళి కూర్చోకపోతే ఇదిగా ఉంటుందని తను చతికిలబడ పోతూన్నా, లోగడ తనకి నమస్కారం పెడుతోచ్చినా ఆసమయంలో చంద్రకళ ఊరుకున్నందుకు కొంచెం చికాకుపడి, అప్పట్లో చంద్రకళ పాడుతూన్నపదం సమాప్తి కానిచ్చి, ఒక హరిదాసు.

హ - ఏదీ, చంద్రకళా! భైరవి పెద్దవర్ణంఅను.

చం - ప్రస్తుతం పాఠం లేదండి.

హ - అయ్యొ ఖర్మమా! అంత పసందుగా పదంపట్టినదానవు, చంద్రకళా! పెద్దవర్ణాన్నే నెట్టేశావే!

చం - (నమస్కరిస్తూ) చిత్తం. నమస్కారం. క్షమించాలి, దాసురాల్ని.

హ - క్షమించాలి, దాసుణ్ణి.

150

వెంకటగిరి - మాణిక్యం! తెలిసిందిలే. స్నేహితుణ్ణి అని చెప్పుగుంటూ రావుజీ ఇంట్లో వ్యవహరిస్తూ వాళ్ళమ్మాయితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతున్నావుటే!

మా - హరహరా! ఇదిట్రా, నన్నెరుగుండీకూడా! ఆ అమ్మాయి ఒకటీ మనచెల్లాయి ఒకటీనా! ఎంతమాటాడావు!

అన్న కొన్నాళ్ళకి ప్రేమజాబొకటి ఇతరుల చేతుల్లో పడడమూ మాణిక్యాన్ని కట్లపాముని కొట్టినట్టు కొట్టడమూ జరిగి, మళ్లీ అతడు వెంకటగిరిని కలియడం తటస్థించగా,

వెం - ఏంరా? నాతో అంత అబద్దం ఎందుకురా? చెల్లాయని చెబుతోచ్చావే!

మా - చెల్లాయంటే ఏమిటి నీఊహ? ఆ అమ్మాయి పేరు చెల్లాయి, తెలుసునా?

వెం - చెల్లమ్మ కాదుట్రా?

మా - ఇంట్లో అంతా చెల్లాయి అంటార్రా, కావలిస్తే రాసిస్తాను.

వెం - ఇంకా ఎందుకులే! నీ రాత ఎల్లాఉందో తెలిసింది.

151

కుస్తీలోనెగ్గి బహుమతీ పట్టిగెళ్ళడానికి, ఒక గొప్పవస్తాదు ఒక మహారాజావారి దర్శనానికోసం దిగగానే, వాడిరూపవర్ణన వినేసరికి, ఆస్థానాన్ని కొరుక్కుతిని పందికొక్కుల్లా బలిసిన ఆస్థాన వస్తాదుల్లో కొందరు నడవలేకపోయీ కొందరు నడవగలిగినవాళ్ళు నడిచివెళ్ళి మంచం ఎక్కగా, మహారాజావారి ప్రతిష్ఠ నిలబెట్టడానికి సమయస్పూర్తిగల ఒక తెనాలిరామలింగం వంటివాడు లంగోటీ బిగించి తయారైన మీదట, పట్టణ మహాజనులందరూ చూస్తూండగా, పర్వతం అంత ఉన్న కొత్తవాడూ వాడిపక్కని

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

108

హాస్యవల్లరి