పుట:హరివంశము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 2

35


చ.

అతనికి నగ్రనందనుఁడు హారిపితృప్రియకారి దారుణ
వ్రతవహనైకసంపదభిరాముఁడు రాముఁడు భూమికన్యకా
స్మితయుతవీక్షణప్రసరసిద్ధమనోరథుఁ డిద్ధ[1]చాపుఁ డు
ద్ధతదశకంధరోన్మథనదర్పధురంధరుఁ డివ్వసుంధరన్.

77


క.

ఆరామున కనుపమధ, ర్మారాముఁడు కుశుఁడు వుట్టె నతిధి యను మహా
వీరుఁడు జనించెఁ గుశునకు, నారాజోత్తముఁడు నిషధుఁ డనుసుతుఁ గాంచెన్.

78


వ.

ఆనిషధునకు నలుండు జన్మించె. వినుము. రఘుకులజాతుం డైన యన్నలుండును
వీరసేనసంభవుం డగు నలుండునుం గా నుర్వీశ్వరులలోనం బ్రసిద్ధు లిద్దఱు నలు.
లింతియ యట్టి నలునకు నభుండును నభునకు బుండరీకుండును బుండరీకునకు
క్షేమధన్వుండును క్షేమధన్వునకు దేవానీకుండును దేవానీకునకు [2]నహీనగుం
డును నహీనగునకు సుధన్వుండును బ్రభవించిరి. ఇది వైవస్వతమను ప్రసూతి
యైన యిశ్వాకువంశంబు.

79


చ.

త్రిభువనదీపమై వెలుఁగు దేవుఁడు భానునియన్వయంబు భ
క్తిభరితబుద్ధియై వినినఁ గీర్తన సేసినఁ బాయుఁ దీవ్రపా
పభయము లిష్టసంపదయు భవ్యయశంబును బొందు నెందు దు
ర్లభ మనఁ గల్గు దివ్యపదలక్ష్మియుఁ జేకుఱు మర్త్యకోటికిన్.

80


వ.

అనిన విని జనమేజయుండు మునీంద్రా సూర్యదేవుండు పితృగణంబులకు
బ్రభుం డని విందుము. పితృగణంబు లనువా రెవ్వరు [3]తత్సమారాధనంబున
నయ్యెడి ఫలం బెట్టిది యెఱింగింపవలయు ననిన వైశంపాయనుం డిట్లనియె. నీ
వడిగిన పితృకల్పంబు మార్కండేయుండు సనత్కుమారువలన విని పిదప భీష్ముం
డడుగ వివరించె. నాగాంగేయుండు కౌంతేయాగ్రజునకు శరతల్పశాయియై
యుండి చెప్పినయది యప్పరిపాటిన యుపన్యసించెద.

81


జనమేజయునకు వైశంపాయనుఁడు పితృదేవతలతెఱఁ గెఱిఁగించుట

క.

విను ధర్మనందనుఁడు భీ, మున కి ట్లనుఁ బితృగణంబు [4]మునిసురతతిచే
తనుఁ బూజ గొనఁగఁ జాలిన, దని పెద్దలు సెప్ప విందు మనఘవివేకా.

82


చ.

తమతమకర్మముల్ దిగువఁ దప్పకపోదురు వేఱువేఱ లో
కములకుఁ దండ్రితాత లనఁగాఁ గలపెద్దలు పుత్రు లిచ్చటన్
గొమరుగఁ బెట్టుపిండములు గుడ్చుట యెట్లొడఁగూడు వారి కే
క్రమమునఁ దత్ఫలంబు నొసఁగంగ [5]సమర్థులు వారు కర్తకున్.

83


ఆ.

[6]ఇట్లు గాక పితరు లెవ్వరేఁ గొందఱు, గలరొ యివ్విధంబు గనము చోద్య
మెఱుఁగవలయుఁ దెలుపవే యన్న ని ట్లని, చెప్పె నతని కవ్విశేషవిదుఁడు.

84
  1. సంపదు
  2. అహస్వతుఁడు
  3. తత్సమారాధన
  4. సురసంతతిచే
  5. లవారలు
  6. అట్లు గాక పితరు లన వేఱఁ గొందఱు