పుట:హరివంశము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

హరివంశము


వ.

ఇట్లు బర్హికేతు సుకేతు శూర పంచజను లనునలువురు దక్క నఖిలసుతసముద
యంబు పొలిసిన నవ్విధం బెఱింగి సగరుండు సనుదెంచి యమ్మునిదేవుం [1]దెల
చినం బ్రీతుండై యతం డారాజునకుం గీర్తిస్వర్గంబు లక్షయంబులుగా నొసంగి
సముద్రుం బుత్రుంగా నిచ్చె సరిత్పతియు సాగరుండై సగరునకుం బ్రణామంబు
సేసి యశ్వమేధీయం బగునశ్వంబు సమర్పించినం గైకొని వచ్చి క్రమంబున.

68


క.

రాజన్యమౌళిమణి నీ, రాజనరాజితపదాబ్జరమ్యుం డగునా
రా జొనరించెను దివిజస, మాజ మలర నశ్వమేధయాగశతంబున్.

69


వ.

అమ్మహాబాహుండు నిజబాహుబలంబునఁ బాలించినపురంబులకొలఁది యఱువది
వేలని విందు మట్టి సగరునకుం బుత్రుం డైనపంచజనునకు నంశుమంతుండు వుట్టె.
[2]నతనికి ఖట్వాంగుం డతని దిలీపుఁడుం బుట్టి రాదిలీపమహీపతికి భగీరథుండు జని
యించి యేకథంబునన వసుంధరయంతయు జయించి సార్వభౌమపదంబు నొంది.

70


చ.

గిరిశజటాటవీనియతఖేలనలోలతరంగ యై సురా
సురనరసేవనీయజలశోభితయై యసమానపావన
స్థిరమహిమాఢ్యయై పరగు దేవతరంగిణిఁ దెచ్చి యుర్విపైఁ
బరపి నిజప్రసూత యనుప్రస్తుతి నొందఁగఁజేసె నెల్లెడన్.

71


తే.

ఆభగీరథజనపతి యనఘుఁ గాంచె, శ్రుతుఁడు నాఁగఁ ద్రిలోకవిశ్రుతుని సుతుని
నతఁడు గనియె నాభాగుఁ బుణ్యైకభాగు, నంబరీషుఁడు నిర్దోషుఁ డతనిపట్టి.

72


సీ.

ఆయంబరీషున కఖిలాన్వయప్రదీ[3]పుండు సింధుద్వీపుఁడు పుట్టె నధిప
ననపాయుఁ డగు [4]నయుతాయువు తత్పుత్రుం డారాజు నలసఖు నక్షహృదయ
విద్యా[5]విదునిఁ గాంచె వినయపూర్ణుని ఋతపర్ణునిఁ గల్మాషపాదు నతఁడు
గనియె నాతఁడు సర్వకరునిఁ బుట్టించె ననరణ్యభూపతి యతనిసుతుఁడు


తే.

తత్తనూజుఁడు నిఘ్నుఁ డాతనికి సూను, లిద్ద ఱనమిత్ర రఘువు లుదీర్ణతేజు
లందుఁ బెద్దవాఁ డడవికి నరిగెఁ దపము, సేయ రెండవువాఁడు శాసించె నుర్వి.

73


క.

భూమి[6]సమున్నతుఁ డగునా, భూమీశుఁడు గాంచెఁ బుత్రుఁ బుణ్యచరిత్రున్
రామప్రపితామహు ను, ద్దామబలు దిలీపుఁ గ్రతుశతప్రవిధాయిన్.

74


క.

విఘటితరిపుదర్పోదయుఁ డఘవిరహితుఁ డాదిలీపుఁ డాత్మజుఁ బడసెన్
రఘు [7]ననఘుని భువనవన, ప్రఘణోజ్జ్వలరత్నదీపభాస్వరతేజున్.

75


మ.

అజుఁ డారాజతనూజుఁ డూర్జితవివేకాలోకవిస్ఫూర్తి [8]యం
దజుఁ డాభూపతికిం దనూభవుఁడు నిత్యౌదార్యసత్యక్షమా
భజనోద్యన్మతి పఙ్క్తి పఙ్క్తిరథభూపాలుండు భూపాలక
వ్రజగోపాలకకేళితత్పరభుజవ్యాపారభవ్యుం డనిన్.

76
  1. దలంచినం
  2. నతఁడు ఖట్వాంగదిలీపుం గనియె నా
  3. ‘వంబరీషస్తు నాభాగిః సింధుద్వీపపితా౽ భవత్', 'అయుతాజిత్తు దాయాదః సింధు ద్వీపస్య వీర్యవాన్' అని పూనా ప్రతి ‘సింధుదీపపితా' అనియు 1-15-18. 'సింధుదీపస్య' అనియు ఎఱ్ఱాప్రెగడ ప్రతి కానోపు.
  4. అయుతాజిత్ - అని మూలము
  5. నిధుని
  6. సమన్వితుఁ.
  7. నలఘుభువనభరణ
  8. మద్భుజు