పుట:హరివంశము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

హరివంశము


సీ.

అనఘ మాతండ్రి శంతనుఁడు లోకాంతరంబున కేఁగినను నేను వినయ మొప్ప
నౌర్ధ్వదైహికములయందుఁ బ్రశస్తిమై నెసఁగుపిండము దగ నిడ దొడంగఁ
గంకణకేయూరకమనీయమును నరుణాంగుళీదళమును నైన హస్త
ముర్వి భేదించి సముత్థితం బగుటయుఁ గని యన్నరేంద్రునికరము గాఁగ


ఆ.

నిశ్చయించి యధికనిపుణంబుగా విచా, రించి శాస్త్రనియమరీతి [1]యొకఁడు
నాదరించి భువిఁ గుశాస్తరణంబు సే, సితిని [2]శాస్త్రవిధిఁ బ్రసిద్ధబుద్ధి.

85


వ.

అవ్విశిష్టకర్మంబునకుం బ్రీతుం డై మాతండ్రి నిజరూపంబుతోనిలిచి నా కిట్లనియె.

86


చ.

అనుపమధర్మవేదివి మహాపురుషుండవు నీవు వేదవా
క్యనియతి పాటిగా నిలిపి తాత్మ భవన్మతిచొ ప్పెఱుంగఁ గో
రి [3]నిరుక్తమంపుఁ గేలు ప్రసరించితిఁ బుత్రులఁ గన్నపుణ్యకీ
ర్తనులకు నెక్కుడై నెగడు ధన్యత నొందితి నేఁడు నందనా.

87


క.

విను రాజు లెట్టి ధర్మము, గొనియాడుదు రట్ల నడుచు గుఱుకొని ధాత్రీ
జనము భవన్మత మింకిట, వినుతింపక యున్నె సకలవిద్వత్తతియున్.

88


వ.

కావున వరం బిచ్చెద సకలప్రాణిసంహర్త యగు మృత్యువు నీ చెప్పినట్ల చేయం
గలయది యింకను నీ కెయ్యది యభిమతం బనిన నతనికి నభివాదనంబు సేసి నీ
ప్రసాదంబున నాకు సర్వంబును సంపన్నంబ యిదియొక్కటి యానతీవలయు నని
నీవు న న్నడిగినయర్థంబ యడిగిన నమ్మహామతి యవ్విధం బభినందించి యి ట్లనియె.

89


తే.

ఆదిసర్గసముద్భవు లమరులకును, బూజనీయులు పితరులు పుణ్యమూర్తు
లనఘ దివమునఁ దేజోమయంబులైన, దేహముల నొప్పుదురు సిద్ధదివ్యబలులు.

90


క.

మము గుఱిచి నామగోత్ర, క్రమమున మీ రర్చ సేయఁగా నే మేలో
కమునం దున్నను మా క, య్యమితకృపానిధు లొనర్తు రానందంబున్.

91


వ.

ఇది సంక్షేపరూపంబునం జెప్పితి వీఁడె మార్కండేయుండు నీచేత నేఁడు నిమం
త్రితుం డై యస్మదనుగ్రహంబు చేసి యున్నవాఁ డిమ్మునీంద్రుండు నిఖిలార్థవేది
యితని నడుగుము తాను బితృభక్తుండు పైతృకవిధివిశేషంబులు వివరించు నని
యానతిచ్చి యంతర్హితుం డయ్యె నంత నేను వినయంబునం బూర్వ[4]ప్రశంసనం
బొనర్చిన నప్పరమతపస్వి యి ట్లనియె.

92


సీ.

విను పితృపూజనం బొనరించి తత్ప్రసాదంబున నేను మోదంబు నెరయ
దీర్ఘాయువును [5]యశోదీప్తతయును గాంచి పరఁగుదు నిట్లుండి బహుసహస్ర
యుగకాల మేఁగుటయును మేరుతటమునఁ బ్రకటితనిష్ఠఁ దపంబుసేయ
నొకనాడు భానుబింబోజ్జ్వలం బగువిమానము నాకుఁ జేరువ నభమునందుఁ


తే.

[6]దోఁచు నంగుష్ఠ త్రగాత్రుని నుదగ్ర, తేజు నగ్నియం దగ్ని ప్రదీప్యమాన
మగుతెఱంగున నొప్పారి యందు వెలుఁగు, పురుషు నొకరునిఁ [7]గంటి నద్భుత మెలర్ప.

93
  1. యకడు
  2. నిగమ
  3. నిరత మేను గేలు పచరించితి (ప్రసరించితి.)
  4. ప్రశ్నం
  5. నేక
  6. దోఁచె
  7. గాంచిత