పుట:హరివంశము.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 10.

523

     ఖ్యలు దీప్తిస్ఫురదస్త్రశస్త్రవిటపిగ్రావోల్లసత్పాణు లై
     పెలుచం జుట్టును ముట్టి రవ్విభు మహాభీమాభిరామాకృతిన్.266
చ. పదములు జాను లూరువులు బాహువు లంటఁగఁబట్టి యెందునుం
     గదలక యుండ నొత్తుఁ డని క్రమ్మినయాబలవద్విరోధులం
     బదములు జంఘ లూరువులు బాహువు లోలి నమర్చి తొక్కియున్
     విదలిచియు న్నొగిల్చియును వ్రేసియుఁ ద్రుంచె నతండు వ్రేల్మిడిన్.267
క. తుహినంబు నాత్మకిరణ, ప్రహతముఁ గావించి మించుభానునిక్రియ న
     ట్లాహితవిమర్దనలీలా, మహితుండై యువ్విభుం డమంథరసరణిన్.268
వ. విక్రమత్రయంబున లోకత్రయంబును నాక్రమించి త్రివిక్రమాభిధానంబున నిగ
     మంబులు ఘోషింపం బరితోషభరితహృదయుం డై యవ్విశ్వరూపప్రపంచం
     బుపసంహరించి సర్వసాధారణరూపంబున నిలిచి దనుజేశ్వరున కి ట్లనియె.269
తే. నీవు నాకు మూడడుగుల నేల యిచ్చి, తతులచారిత్ర సభ్యచయం బెఱుంగ
     నేను నాయడుగులపాటి నీజగత్త్ర, యముఁ గైకోలుగొంటి నాసొమ్ము గాఁగ.270
క. నీ కింక నేల రాదీ, లోకము లెటయైనఁ బొమ్ము లుంఠితరాజ్య
     శ్రీకుఁడ వై తనుటయు నతఁ, డాకంపితవినతదేహుఁడై కడుభక్తిన్.271
తే. ఏ ననఁగ నెవ్వఁడను దేవ యీయొడలు స, మర్పితము నీకు దీన నెయ్యది యొనర్తు
     నానతిమ్ము కృపార్ద్రుండవై శరణ్య, భక్తవత్సల శ్రీనాథ పద్మనాభ.272
వ. అనినం బ్రసన్నుం డై పరమేశ్వరుం డసురేశ్వరున కి ట్లనియె.273

వామనుఁడు బలిని సబాంధవంబుగాఁ బాతాళంబునకుఁ బోవం బనుచుట

క. నీవలన సంతసిల్లితిఁ, గోవిదనుత యిష్టధనము గుణవత్ప్రాపం
     బై వచ్చిన నా కిచ్చితి, గావున నిర్భయుఁడ వగు జగంబులయందున్.274
వ. పాతాళంబునందు సుతలంబనఁ బ్రసిద్ధం బైన నెలవు గల దచ్చోటికిం జని సభృత్య
     బాంధవుండ వై వసియింపుము దివ్యంబులు నక్షయంబులు నపరిమితంబులు
     నగుభోగంబులు భవదిచ్ఛానురూపంబు లై యం దొదవెడు నధికదక్షిణంబు లగు
     నధ్వరంబులు నుదాత్తదానంబులు నాచరింప నర్హంబు లగువస్తువు లపరిచ్ఛేదంబు
     లయి యఖిలకాలంబులు సంపన్నంబులుగాఁ గలయవి వినుము మహేంద్రుండు
     మహానుభావుండు గావున నాకు నర్చనీయుం డతనికి నీవు వినమ్రుండ వై
     విబుధులయందునుం బూజ్యభావంబు భావించి వర్తింపవలయు నిట్టిమదీయ
     శాసనం బెప్పుడు దప్పిన నుదగ్రఫణంబు లగు ఫణాధరంబులు ప్రాణాంతకదండం
     బున దండించు నవహితుండ వై బ్రతుకుము మీఁద నెంతయు మే లొనర్చెద
     ననిన నవ్విభునకు విరోచనతనయుం డి ట్లనియె.275