పుట:హరివంశము.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

524

హరివంశము

క. క్రతుభాగభోగమున సుర, లతిమోదముఁ బొంది క్రాల నచ్యుత యేఁ బ్రా
     కృతభోగంబుల సంప్రీ, తత నెమ్మెయి నుండువాఁడఁ దలఁపుము దీనిన్.276
సీ. నావుడు నంభోజనాభుఁ డశ్రోత్రియశ్రాద్ధంబు నవ్రతచర్యమైన
     యధ్యయనంబును నపగతదక్షిణక్రతువు నమంత్రకహుతము శ్రద్ధ
     చాలనిదానంబు సంస్కారవిరహితం బగుహవిస్సును నన నాఱుతెఱఁగు
     లిచ్చితి నీభుక్తి కెవ్వఁ డీశ్వరున కప్రియకారి నన్ను గర్హించు నెవ్వఁ
తే. డగ్నిహోత్రియై క్రయవిక్రయముల బ్రతుకు, నెవ్వఁ డట్టివారలపుణ్య మెల్ల నీవు
     గొనుము పొమ్మని వీడ్కొల్పదనుజపతియు, హర్షపూర్ణుఁడై హరికి సాష్టాంగ మెరఁగి.277
వ. సర్వదైత్యసమేతుం డై పాతాళంబునకుం జని జనార్ధననిర్దిష్ట ప్రకారంబున నుండె
     నంత నిక్కడ.278
క. తనబుద్ధివిక్రమంబుల, ననుపమ మగు రాజ్యలక్ష్మి యవలీల మెయిన్
     గొని విష్ణుఁడు త్రైలోక్యం, బును సురలకుఁ బూర్వమార్గమున విభజించెన్. 279
వ. అమ్మహాతుం డి ట్లేర్పరించి యొసంగ నీం ద్రుండు పూర్వదిగ్రాజ్యంబు గైకొనియె
     ధర్ముండు దక్షిణదిశాధిపత్యం బధిష్ఠించె వరుణుండు ప్రత్యర్థిగానుశాసి యై నిలిచె
     గుబేరుం డుత్తరహరిత్పాలనం బంగీకరించె భుజంగవిభుం డధోభువనభరణంబున
     నుల్లసిల్లె సోముం డూర్ధ్వలోకాధీశ్వరుం డై యొప్పెఁ దక్కినవారును దమ తమ
     పదంబులఁ బ్రమదంబుం బొంది రిట్లు సర్వలోకోపకారవినోదుం డై యద్దేవుండు.280
మ. అదితిం గశ్యపు నిత్యసత్కృతిఁ గృతార్థారంభులం జేయుచుం
     ద్రిదశాచార్యుఁడు లోనుగాఁగలమునిశ్రేణిం బ్రియాహ్లాదనా
     భ్యుదయప్రౌఢి ననుగ్రహించుచు సురల్ పూజింపఁ బ్రత్యాదర
     ప్రదలీలం బ్రసరింపుచున్ భువనముల్ పాలించుచుండెం గృపన్.281
వ. అని చెప్పి వైశంపాయనుండు.282
క. ఈవామనావతారక, థావిస్తర మనఘ దేవతలకును ధరణీ
     దేవతలకు సంభావ్యము, గావున వినఁ జదువఁ గల్గుఁ గల్యాణంబుల్.283
క. విను సర్వకాలమును ని, య్యనుపమకథనంబు వినిన నతినియతిఁ బఠిం
     చిన నసురల విష్ణుఁడు గెలి, చినక్రియ జనవిభుఁడు గెలుచు శీఘ్రమ రిపులన్.284
క. వామనదేవుఁడు భువన, ప్రేమాస్పద మైనభంగిఁ బ్రియుఁ డగు మనుజ
     స్తోమములకు నవ్విభునిమ, హామహిమలు విను మనుష్యుఁ డనవరతంబున్.285
క. ధనములఁ గోరిన ధనములఁ, దనయులఁ గోరినఁ దనయులఁ దరలాక్షులం గో
     రినఁ దరలాక్షులఁ బడయును, జనుఁ డీబలిమథనకథను జదివిన వినినన్.286
క. ఆయువు నారోగ్యంబును, శ్రీయును బహుపుత్రపౌత్రచిరసౌఖ్యములం
     జేయుఁ ద్రివిక్రముచరితము, పాయక యాకర్ణితంబుఁ బఠితము నగుచున్.287